మాట నిలబెట్టుకున్న జర్మనీ.. భారతీయులకు ట్రాన్సిట్ వీసా రద్దు
- జర్మనీ విమానాశ్రయాల ద్వారా ప్రయాణించే భారతీయులకు ట్రాన్సిట్ వీసా రద్దు
- ఇవాళ్టి నుంచే అధికారికంగా అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన
- జనవరిలో ప్రధాని మోదీ, జర్మన్ ఛాన్సలర్ మెర్జ్ మధ్య జరిగిన చర్చల ఫలితమిది
- ఈ మినహాయింపు నాన్-షెంజెన్ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు మాత్రమే వర్తింపు
ఈ ఏడాది జనవరి 12, 13 తేదీలలో జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ భారత పర్యటన సందర్భంగా ఈ మినహాయింపుపై తొలిసారిగా ప్రకటన వెలువడింది. ఆ పర్యటనలో ఇచ్చిన హామీకి అనుగుణంగా జర్మనీ ఫెడరల్ లా గెజెట్ లో జూన్ 2న అధికారిక ప్రకటన జారీ చేసి, జూన్ 3 నుంచి దీనిని అమలు చేస్తున్నట్లు జర్మన్ ఎంబసీ తెలిపింది. "భారత్-జర్మనీ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల ప్రజల మధ్య రాకపోకలను సులభతరం చేయడానికి, ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ నిర్ణయం అందులో భాగమే" అని రాయబార కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది.
జర్మనీ నిర్ణయాన్ని భారత విదేశాంగ శాఖ స్వాగతించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ.. "జర్మనీ ద్వారా విమాన ప్రయాణం చేసే భారతీయ పౌరులకు ట్రాన్సిట్ వీసా అవసరాన్ని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం అమల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ, ఛాన్సలర్ మెర్జ్ మధ్య జనవరిలో జరిగిన చర్చల ఫలితమే ఈ నిర్ణయం. ఇది ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తుంది" అని తెలిపారు.
ప్రయాణికులు తెలుసుకోవాల్సినవి ఏమిటి?
ఈ కొత్త నిబంధనల ప్రకారం భారత పాస్‌పోర్ట్ హోల్డర్లు షరతులకు లోబడి జర్మన్ విమానాశ్రయాల ద్వారా వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ప్రయాణికులు తప్పనిసరిగా అంతర్జాతీయ ట్రాన్సిట్ జోన్‌లోనే ఉండాలి, విమానాశ్రయం విడిచి బయటకు రాకూడదు. అలాగే, 24 గంటలలోపు నాన్-షెంజెన్ దేశానికి తమ ప్రయాణాన్ని కొనసాగించాలి.
అయితే, ఈ మినహాయింపు జర్మనీలో లేదా ఇతర షెంజెన్ దేశాలలో ప్రవేశానికి అనుమతి ఇవ్వదని ప్రయాణికులు గుర్తించాలి. ఒకవేళ ప్రయాణికులు విమానాశ్రయం నుంచి బయటకు రావాలనుకుంటే, వారికి సరైన వీసా తప్పనిసరి. ఈ వీసా మినహాయింపుతో భారతీయులు ప్రయాణానికి ముందు పత్రాల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం తగ్గింది. ముఖ్యంగా విద్యార్థులు, వృత్తి నిపుణులు, కుటుంబాలకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశం.