జపనీస్ దంపతుల అపూర్వ ఆతిథ్యం.. నీళ్ల కోసం వెళ్లిన భారతీయ యూట్యూబర్‌కు కడుపునిండా భోజనం!
- నీళ్ల కోసం వెతుకుతూ జపనీస్ వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లిన ఆదిత్య పార్ఖీ
- నీళ్లకు బదులుగా జ్యూస్ ఇచ్చి, ఆపై లంచ్‌కు ఆహ్వానించిన దంపతులు
- హోం మేడ్ హెర్బల్ నాన్, కర్రీతో భారతీయ హైకర్‌కు విందు
- 'నువ్వు చాలా అందంగా ఉన్నావు' అంటూ వృద్ధురాలి ప్రశంసలు
- జపనీస్ సంస్కృతి, ఆతిథ్యానికి అద్దం పట్టిన వైరల్ వీడియో
ఆదిత్య పార్ఖీ జపాన్ చుట్టుపక్కల తన ప్రయాణ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే అతడు షేర్ చేసిన తాజా వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో.. ఆదిత్య ఒక జపనీస్ వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి "నన్ను క్షమించండి, ఇక్కడ నీళ్లు దొరికే కెఫే ఏదైనా ఉందా?" అని ఎంతో మర్యాదగా అడిగాడు. దానికి ఆ వృద్ధుడు కేవలం దారి చూపించి ఊరుకోకుండా, ముఖంపై పెద్ద నవ్వుతో లోపలికి వెళ్లి.. నీళ్లకు బదులు 'జ్యూస్ తాగుతావా?' అని అడిగి మరీ బాటిల్, గ్లాస్ తెచ్చి స్వయంగా సర్వ్ చేశాడు. కేవలం సహాయం కోసం అడిగిన ఆ చిన్న ప్రశ్న, ఆ తర్వాత ఒక మధురమైన జ్ఞాపకంగా మారుతుందని ఆదిత్య అస్సలు ఊహించలేదు.
ఆ వృద్ధ దంపతులు ఆదిత్యను ఎంతో ఆదరంగా తమ ఇంటి లోపలికి ఆహ్వానించి, హాల్లో కూర్చోబెట్టి ముచ్చటించారు. తాను కంప్యూటర్ రంగంలో పనిచేస్తున్నానని, ఈ ప్రాంతాన్ని చూడటానికి వచ్చానని ఆదిత్య వారికి వివరించాడు. కొద్దిసేపటికే ఆ వృద్ధుడి భార్య కూడా వారితో కలిసింది. ఆమె ఏకంగా.. "మధ్యాహ్నం భోజనానికి కర్రీ (Curry) తింటావా? మాతో పాటే ఇక్కడే భోజనం చేసి వెళ్ళు" అంటూ ఎంతో ప్రేమగా కోరింది. ఆ దంపతులు స్వయంగా ఇంట్లోనే తయారు చేసిన హెర్బల్ నాన్ (Herbal Naan), కర్రీని ఆదిత్యకు వడ్డించారు. ఆ వృద్ధ దంపతుల అపరిమితమైన ఆతిథ్యానికి ఆదిత్య ఎమోషనల్ అయ్యాడు.
ఈ సరదా సంభాషణల మధ్య ఆ వృద్ధురాలు ఆదిత్యను చూసి "నువ్వు చాలా పొడవుగా, ఎంతో అందంగా (Handsome) ఉన్నావు" అంటూ కాంప్లిమెంట్ ఇవ్వడంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. చివరగా ఆదిత్య ప్రయాణాన్ని కొనసాగించేందుకు సిద్ధమవ్వగా, ఆ దంపతులు ఇంటి బయట వరకు వచ్చి టాటా చెబుతూ, శుభప్రయాణం (Safe Trip) అంటూ వీడ్కోలు పలికారు. ఈ వీడియోను ఆదిత్య ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. "నేను కేవలం నీళ్లు మాత్రమే అడిగాను" అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీగా లైకులు, కామెంట్లు వస్తున్నాయి. జపనీస్ సంస్కృతిలో ఉన్న మానవత్వాన్ని, ఆతిథ్య మర్యాదలను ఈ వీడియో అద్భుతంగా ఆవిష్కరించిందని కొనియాడుతున్నారు.