ప్రపంచంలోనే తొలిసారి.. ఒకే వ్యక్తికి పంది కాలేయం, రెండు కిడ్నీల‌ను అమర్చిన చైనా వైద్యులు

  • చైనాలో అరుదైన అవయవ మార్పిడి శస్త్రచికిత్స
  • బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి పంది కాలేయం, రెండు కిడ్నీల మార్పిడి
  • జన్యుపరంగా మార్పులు చేసిన పంది నుంచి అవయవాల సేకరణ
  • మనిషి శరీరంలో పంది అవయవాలు విజయవంతంగా పనిచేస్తున్నాయని వెల్లడి
  • ప్రపంచంలో ఇలాంటి మల్టీ-ఆర్గాన్ జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ ఇదే తొలిసారి
వైద్య విజ్ఞాన రంగంలో చైనా శాస్త్రవేత్తలు ఒక అపూర్వమైన మైలురాయిని సాధించారు. ఒకే మనిషికి పంది నుంచి సేకరించిన కాలేయం, రెండు మూత్రపిండాలను విజయవంతంగా అమర్చి ప్రపంచ రికార్డు సృష్టించారు. సౌత్ చైనాలోని ఒక విశ్వవిద్యాలయంలో సన్ జుయాంగ్ నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ అసాధారణ శస్త్రచికిత్సను నిర్వహించినట్లు సోమవారం ప్రకటించింది. జన్యుపరంగా మార్పులు చేసిన పంది నుంచి సేకరించిన బహుళ అవయవాలను (కాలేయం, మూత్రపిండాలు) ఒకేసారి మనిషికి అమర్చడం (ఆర్థోటోపిక్ జెనోట్రాన్స్‌ప్లాంటేషన్) ప్రపంచంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఈ పరిశోధన కోసం బ్రెయిన్ డెడ్ అయిన 53 ఏళ్ల వ్యక్తి శరీరాన్ని ఉపయోగించారు. అతని కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ శస్త్రచికిత్సను చేపట్టారు. ఇందుకోసం చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ ప్రాంతానికి చెందిన ప్రత్యేక 'బామా' జాతి పంది నుంచి అవయవాలను సేకరించారు. మానవ శరీరం జంతు అవయవాలను తిరస్కరించకుండా (హైపర్‌అక్యూట్ రిజెక్షన్) ఉండేందుకు శాస్త్రవేత్తలు కీలకమైన జన్యు మార్పులు చేశారు. దాత పందిలోని రోగనిరోధక తిరస్కరణకు కారణమయ్యే మూడు జన్యువులను తొలగించి, రక్త ప్రసరణ మెరుగుపరిచే, రోగనిరోధక శక్తికి అనుకూలంగా ఉండే మూడు మానవ జన్యువులను ప్రవేశపెట్టారు.

శస్త్రచికిత్స జరిగిన 24 గంటల్లోనే అద్భుతమైన ఫలితాలు కనిపించాయి. పంది కాలేయం పైత్యరసాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభించగా, రెండు మూత్రపిండాలు కూడా సాధారణంగా పనిచేయడం మొదలుపెట్టాయి. బాధితుడి రక్తంలో క్రియాటినిన్ స్థాయులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకున్నాయని, ఇది మూత్రపిండాల పనితీరుకు నిదర్శనమని పరిశోధకులు తెలిపారు. ఒకే సర్జికల్ కోత ద్వారా కాలేయం, రెండు కిడ్నీలను మార్పిడి చేయడానికి సన్ జుయాంగ్ అభివృద్ధి చేసిన ప్రత్యేక ఆర్థోటోపిక్ టెక్నిక్‌ను ఈ ఆపరేషన్‌లో ఉపయోగించారు.

ఒకేసారి బహుళ జంతు అవయవాలు మానవ శరీరంలో సమర్ధవంతంగా పనిచేయగలవని ఈ అధ్యయనం నిరూపించిందని పరిశోధక బృందం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాతల అవయవాల కొరతను తీర్చే దిశగా ఈ విజయం ఒక కీలక ముందడుగని, భవిష్యత్తులో జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ క్లినికల్ అప్లికేషన్లకు కొత్త ఆశలు రేకెత్తిస్తోందని శాస్త్రవేత్తలు వివరించారు.

Organ Transplantation
China
Pig liver
Pig kidneys
Human

More Telugu News