నేపాల్ ప్రధాని వ్యాఖ్యలపై భారత్ ఘాటు స్పందన
- భారత్-నేపాల్ సరిహద్దు వివాదంలో మూడో దేశం జోక్యం కుదరదని స్పష్టం చేసిన భారత్
- ఇది పూర్తిగా ద్వైపాక్షిక అంశమని భారత విదేశాంగ శాఖ వెల్లడి
- భారత్, నేపాల్ పరస్పరం భూభాగాలు ఆక్రమించుకున్నాయన్న నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు
- ద్వైపాక్షిక చర్చలకే కట్టుబడి ఉన్నామని భారత్ స్పష్టీకరణ
నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ఇటీవల పార్లమెంటులో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ స్పందించింది. సరిహద్దు సమస్య పరిష్కారానికి భారత్, చైనాలతో మాట్లాడడమే కాకుండా, యూకే ప్రభుత్వంతో కూడా మాట్లాడామని చెప్పారు. యూకే ప్రభుత్వం కూడా దీనిపై దృష్టిసారించాలని కోరుకుంటున్నామని, ఎందుకంటే, భారత్ ను బ్రిటీషర్లు పరిపాలించిన చరిత్రతో ఈ సమస్యకు సంబంధం ఉందని వివరించారు.
అంతేకాకుండా, భారత్ తమ భూభాగంలోకి చొరబడినట్లే, నేపాల్ కూడా కొన్ని ప్రాంతాల్లో భారత భూభాగాలను ఆక్రమించుకుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు నేపాల్ పార్లమెంటులో తీవ్ర దుమారం రేపాయి. ప్రభుత్వ వైఖరిని బలహీనపరిచారంటూ ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. దీంతో నేపాల్ విదేశాంగ శాఖ వెంటనే రంగంలోకి దిగి వివరణ ఇచ్చింది. ప్రధాని వ్యాఖ్యలు సరిహద్దులోని 'దస్‌గజ' (నో-మ్యాన్స్ ల్యాండ్) ప్రాంతంలో ఇరు దేశాల పౌరుల భూ వినియోగానికి సంబంధించినవని, అధికారిక ప్రాదేశిక వాదనలకు కాదని పేర్కొంది. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా విషయంలో తమ అధికారిక వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, ద్వైపాక్షిక చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకుంటామని స్పష్టం చేసింది.
1816 నాటి సుగౌలీ ఒప్పందం ప్రకారం కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా తమవేనని నేపాల్ వాదిస్తుండగా, ఆ ప్రాంతాలు ఉత్తరాఖండ్‌లో భాగమని భారత్ పేర్కొంటోంది. తాజాగా నేపాల్ ప్రధాని వ్యాఖ్యలపై స్పందించిన భారత్, ఏ దేశం మధ్యవర్తిత్వాన్నయినా తిరస్కరిస్తూ, ఇది కేవలం రెండు దేశాల మధ్య పరిష్కారం కావాల్సిన అంశమని తేల్చిచెప్పింది.