మమతకు షాకిచ్చిన ఎమ్మెల్యేలు.. కీలక సమావేశం రద్దు!
- మమతా బెనర్జీ నివాసంలో జరగాల్సిన టీఎంసీ ఎమ్మెల్యేల సమావేశం రద్దు
- 80 మంది ఎమ్మెల్యేల్లో వచ్చింది 20 మందే
- ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారిగా కీలక భేటీకి పిలుపు
- అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన మరుసటి రోజే ఈ పరిణామం
- క్షేత్రస్థాయి నిరసనల వల్లే ఎమ్మెల్యేలు రాలేదన్న పార్టీ నాయకత్వం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 294 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 208 సీట్లు గెలుచుకోగా, టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలో పార్టీ వ్యూహాలు, సంస్థాగత అంశాలపై చర్చించేందుకు మే 31న కోల్‌కతాలోని మమత కాళీఘాట్ నివాసంలో ఈ సమావేశానికి పిలుపునిచ్చారు. అయితే, చాలామంది ఎమ్మెల్యేలు ఈ భేటీకి గైర్హాజరయ్యారు.
అయితే, ఎమ్మెల్యేల గైర్హాజరుపై పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ వివరణ ఇచ్చారు. అధికారులకు వ్యతిరేకంగా జిల్లా స్థాయిలో జరుగుతున్న నిరసనల్లో, అరెస్టయిన కార్యకర్తలకు సహాయం అందించడంలో చాలా మంది ఎమ్మెల్యేలు నిమగ్నమై ఉన్నారని ఆయన తెలిపారు. వారి అభ్యర్థన మేరకే సమావేశాన్ని వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.
తాజా పరిణామాలతో టీఎంసీలో అంతర్గత అసమ్మతి పెరుగుతోందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఎన్నికల ఓటమి, ముఖ్య నేతలపై దాడులు, అభిషేక్ బెనర్జీపై ఉన్న ఫోర్జరీ సంతకాల కేసు వంటి విచారణల ఒత్తిడితో పార్టీలో గందరగోళం నెలకొందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.