33 ఏళ్ల నాటి కేసు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు

84 year old man convicted in 33 year old bihar attempted case after decades long trial
  • 1992లో బీహార్‌లో జరిగిన ఓ చిన్న గొడవకు సంబంధించిన కేసు
  •  విచారణ సాగుతుండగానే నలుగురు నిందితులు మృతి
  •  వృద్ధుడిని దోషిగా నిర్ధారించిన హాజీపూర్ కోర్టు
  •  న్యాయవ్యవస్థలో జాప్యంపై మరోసారి చర్చకు దారితీసిన ఘటన
భారత న్యాయవ్యవస్థలో నెలకొన్న జాప్యానికి అద్దం పట్టేలా ఓ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. 33 ఏళ్ల క్రితం నమోదైన హత్యాయత్నం కేసులో 84 ఏళ్ల వృద్ధుడిని కోర్టు దోషిగా తేల్చింది. ఈ సుదీర్ఘ విచారణ, తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
 
వివరాల్లోకి వెళ్తే, 1992 నవంబర్ 10న బీహార్‌లోని వైశాలి జిల్లా రాఘవ్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీప్ రాయ్ అనే వ్యక్తి, అతని అనుచరులు అదాలత్ రాయ్ అనే వ్యక్తి ఇంటి ముందు రోడ్డుపై పగిలిన గాజు ముక్కలు పడేశారు. దీనిపై అదాలత్ రాయ్, ఆయన భార్య ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో ఆయుధాలు, తుపాకులతో దాడులు చేసుకున్నారు.
 
ఈ ఘటనపై 1993 మార్చిలో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయగా, 1999లో అభియోగాలు నమోదు చేశారు. మూడు దశాబ్దాలకు పైగా సాగిన ఈ విచారణలో 10 మంది సాక్షులను విచారించారు. కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురు విచారణ సమయంలోనే మరణించడం గమనార్హం. ప్రస్తుతం ఏకైక నిందితుడిగా మిగిలిన 84 ఏళ్ల దీప్ రాయ్‌ను హాజీపూర్‌లోని అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు ఐపీసీ సెక్షన్ 147, 148, 307 కింద దోషిగా నిర్ధారించింది. మంగళవారం శిక్ష ఖరారు చేయనుంది.
 
 తీర్పు అనంతరం, ఇద్దరు వ్యక్తుల సహాయంతో బలహీనంగా నడుస్తున్న దీప్ రాయ్‌ను పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ చిన్న గొడవకు సంబంధించిన కేసులో తీర్పు వెలువడటానికి 33 ఏళ్లు పట్టడం న్యాయవ్యవస్థ పనితీరుపై తీవ్ర చర్చకు దారితీసింది.
Go Back to Shorts
Judgment
84 year old man
convicted
Bihar
Attempted Case
long trial

More Telugu News