నైరుతి రాక ఆలస్యం.. మరో రెండు మూడు రోజుల్లో కేరళలోకి ప్రవేశం!

  • కేరళకు నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం
  •  మరో రెండు మూడు రోజుల్లో ప్రవేశించే అవకాశం
  •  గాలుల తీవ్రత బలహీనపడటమే జాప్యానికి కారణం
  •  ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా అంచనా
  •  ఉత్తర భారతంలో కొనసాగుతున్న వడగాలులు
దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతోంది. సాధారణంగా జూన్ 1న కేరళను తాకే ఈ రుతుపవనాలు, ఈసారి కొన్ని రోజులు ఆలస్యంగా ప్రవేశించనున్నాయి. అయితే, రాబోయే రెండు మూడు రోజుల్లో రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం ప్రకటించింది. జూన్ 4 లేదా 5వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
 
మొదట మే 26 నాటికే రుతుపవనాలు వస్తాయని ఐఎండీ అంచనా వేసినప్పటికీ, వాతావరణంలో మార్పుల కారణంగా అది సాధ్యపడలేదు. గాలుల వేగం తక్కువగా ఉండటం, బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల వల్ల రుతుపవనాల కదలిక మందగించింది. కేరళలోని 60 శాతం వాతావరణ కేంద్రాల్లో వరుసగా రెండు రోజులపాటు 2.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవడంతో పాటు, గాలుల దిశ, వేగం వంటి నిర్దిష్ట ప్రమాణాలను అందుకుంటేనే రుతుపవనాల ఆగమనాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ప్రస్తుతం ఈ పరిస్థితులు ఇంకా పూర్తిస్థాయిలో ఏర్పడలేదు.
 
ఈ ఏడాది దేశంలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా, దీర్ఘకాలిక సగటులో కేవలం 90 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. ఇది వర్షాధార వ్యవసాయంపై ఆధారపడిన రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఉత్తర, మధ్య భారతదేశంలో ఎండల తీవ్రత, వడగాలులు కొనసాగుతున్నాయి. రుతుపవనాలు కేరళను తాకిన తర్వాత, నెమ్మదిగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి.

southwest monsoon
Kerala
IMD
Rains

More Telugu News