ఆపిల్ స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ వాయిదా.. 2027 వరకు ఆగాల్సిందే!

Apple Smart Glasses Launch Delayed Until 2027
  • సాధారణ కళ్లజోళ్ల మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని రూపకల్పన
  • ఆపిల్ వాచ్ తరహా వ్యూహంతో ముందుకు వెళ్లనున్న కంపెనీ
  • తొలి వెర్షన్‌ నుంచి అగుమెంటెడ్ రియాలిటీ ఫీచర్ ఔట్! 
  • ధర 200 నుంచి 500 డాలర్ల మధ్య ఉండే అవకాశం
టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్మార్ట్ గ్లాసెస్ విడుదల మరింత ఆలస్యం కానుంది. సాంకేతిక, అభివృద్ధిపరమైన సవాళ్ల కారణంగా వీటి లాంచ్‌ను 2027 చివరికి వాయిదా వేసినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. కేవలం స్మార్ట్ గ్లాసెస్ విభాగంలోనే కాకుండా, ఆపిల్ వాచ్ తరహాలోనే సాధారణ కళ్లజోళ్ల మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని వీటిని తీసుకురావాలని కంపెనీ వ్యూహం రచిస్తోంది.

బ్లూమ్‌బెర్గ్ ప్రతినిధి మార్క్ గర్‌మన్ తన ‘పవర్ ఆన్’ న్యూస్‌లెట్టర్‌లో ఈ వివరాలను వెల్లడించారు. అంతర్గతంగా 'N50' కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చెందుతున్న ఈ గ్లాసెస్‌ను వాస్తవానికి 2026 చివర్లో ఆవిష్కరించి, 2027 ప్రారంభంలో మార్కెట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ తాజా జాప్యంతో వీటి విడుదల 2027 చివరి నాటికి జరగనుంది. కంపెనీ సీఈవో టిమ్ కుక్ పదవీ విరమణకు ముందు ఈ ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఫీచర్లు.. ధర వివరాలు
తొలి వెర్షన్ స్మార్ట్ గ్లాసెస్‌లో లెన్స్‌లోనే కనిపించే అగుమెంటెడ్ రియాలిటీ (AR) డిస్‌ప్లేలు ఉండవని తెలుస్తోంది. బదులుగా, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే ఫీచర్లపై దృష్టి సారించారు. ఫోటోలు, వీడియోలు తీయడానికి ఓవల్ ఆకారంలో కెమెరాలు, కాల్స్ మాట్లాడటానికి, సంగీతం వినటానికి, సిరితో మాట్లాడటానికి మైక్రోఫోన్లు, స్పీకర్లు ఉంటాయి. ఆపిల్ ఇంటెలిజెన్స్ సాయంతో నడక దారులను చూపించడం వంటి సదుపాయాలు కూడా ఉండనున్నాయి.

రే-బాన్ వేఫేరర్, ఇతర స్లిమ్ డిజైన్ల వంటి పలు ఫ్రేమ్ స్టైల్స్‌ను ఆపిల్ పరీక్షిస్తోంది. వీటి ధర 200 నుంచి 500 డాలర్ల (సుమారు రూ. 16,000 నుంచి రూ. 42,000) మధ్య ఉండొచ్చని అంచనా. ఈ ధరతో మెటా రే-బాన్ వంటి స్మార్ట్ గ్లాసెస్‌కే కాకుండా, ఓక్లే, వార్బీ పార్కర్ వంటి సంప్రదాయ ఐవేర్ బ్రాండ్లకు కూడా ఇది పోటీ ఇవ్వనుంది. ఐఫోన్‌పై ఎక్కువగా ఆధారపడే ఈ గ్లాసెస్, తక్కువ బరువు (50 గ్రాముల లోపు), రోజంతా బ్యాటరీ లైఫ్ కోసం ఆపిల్ వాచ్ సిలికాన్‌తో రూపొందించిన ప్రత్యేక ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నాయి.

ఆపిల్ వాచ్ తరహాలోనే టెక్నాలజీని ఫ్యాషన్‌తో కలిపి, సుమారు 200 బిలియన్ డాలర్ల ప్రపంచ ఐవేర్ మార్కెట్‌లో కీలక స్థానం సంపాదించాలని ఆపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయంలో కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Go Back to Shorts
Apple Smart Glasses
Apple
Smart Glasses
Tim Cook
Augmented Reality
AR Display
Meta Ray-Ban
Eyewear Market
Apple Watch
Technology

More Telugu News