సాత్విక్-చిరాగ్ జోడీకి వరల్డ్ టైటిల్... అభినందించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్

  • సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న సాత్విక్-చిరాగ్
  • ఫైనల్‌లో ఇండోనేషియా జోడీపై విజయం
  • తొలి గేమ్ కోల్పోయినా అద్భుత పునరాగమనం
  • 73 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరు
  • స్పందించిన చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ 
భారత స్టార్ బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి సింగపూర్‌లో చారిత్రక విజయం సాధించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేఎఫ్ఎఫ్ సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్ 2026 పురుషుల డబుల్స్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న ఈ జోడీకి ఆయన అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ, "సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టిల చారిత్రక విజయం పట్ల గర్వంగా ఉంది. మీ అద్భుతమైన గెలుపు, ఆధిపత్య ప్రదర్శన మీ అంకితభావం, పట్టుదల, నైపుణ్యానికి నిదర్శనం" అని కొనియాడారు. ప్రపంచ వేదికపై మరోసారి భారతదేశాన్ని గర్వపడేలా చేశారని, దేశంలోని లక్షలాది మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు.

ముఖ్యంగా, ఈ విజయంతో ఆంధ్రప్రదేశ్ బిడ్డ అయిన సాత్విక్‌సాయిరాజ్ రాష్ట్రానికి గొప్ప కీర్తిప్రతిష్ఠలు తీసుకువచ్చారని చంద్రబాబు ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ చిరస్మరణీయ విజయం సందర్భంగా ఇద్దరు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, భవిష్యత్తులో వారు మరెన్నో విజయాలు, మైలురాళ్లు సాధించాలని ఆకాంక్షించారు.

హర్షం వ్యక్తం చేసిన లోకేష్

భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి సంచలన ప్రదర్శనతో అదరగొట్టారని ఏపీ మంత్రి నారా లోకేష్ కొనియాడారు. కేఎఫ్ఎఫ్ సింగపూర్ ఓపెన్ 2026 పురుషుల డబుల్స్ టైటిల్‌ను ఈ జోడీ కైవసం చేసుకుందని, ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన ఫజర్ అల్ఫియాన్, మహ్మద్ షోహిబుల్ ఫిక్రీ ద్వయంపై గెలుపొందారని వివరించారు.

సుమారు 73 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో సాత్విక్-చిరాగ్ 18-21, 21-17, 21-16 తేడాతో విజయం సాధించడం అమోఘం అని లోకేష్ ప్రశంసించారు. తొలి గేమ్ కోల్పోయి వెనుకబడినప్పటికీ, అసాధారణ పోరాట పటిమతో పుంజుకుని మిగిలిన రెండు గేములను గెలుచుకోవడం విశేషం అని, వారి దూకుడైన ఆటతీరు ముందు ప్రత్యర్థులు నిలవలేకపోయారని తెలిపారు.

ఈ విజయంపై భారత జోడీకి అభినందనలు తెలుపుతున్నట్టు ట్వీట్ చేశారు. "73 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ స్వచ్ఛమైన బ్యాడ్మింటన్ డ్రామా. తొలి గేమ్ ఓడిపోయినా, ఆ తర్వాత మన క్రీడాకారులు అద్భుతమైన పట్టుదల ప్రదర్శించారు. ఛాంపియన్లకు నా అభినందనలు" అంటూ వారిని కొనియాడారు.

Satwiksairaj Rankireddy
Chirag Shetty
Singapore Open 2026
KFF Singapore Open
Badminton Doubles
Nara Lokesh
Chandrababu Naidu
Indian Badminton
Sports News
AP News

More Telugu News