బాబాగా మారాలని ఘాతుకం.. తీవ్ర ఒత్తిడిలో రైతు విపరీత చర్య
- మధ్యప్రదేశ్‌లో దారుణం.. జననాంగాన్ని నరుక్కున్న రైతు
- గొడ్డలితో జననాంగాన్ని నరుక్కుని బావిలో పడేసిన వైనం
- భార్య అనారోగ్యం, కూతురి పెళ్లితో తీవ్ర మానసిక ఒత్తిడి
- పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించిన వైద్యులు
అసలేం జరిగిందంటే..!
బాధిత రైతు కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నాడు. కుటుంబ బాధ్యతల నుంచి, తాను భావిస్తున్న పాపభీతి నుంచి విముక్తి పొందాలని నిర్ణయించుకున్నాడు. సంసార జీవితాన్ని వదిలేసి బాబాగా మారిపోవాలని బలంగా నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలో తన జననాంగాన్ని పాపానికి మూలంగా భావించి, దానిని తొలగించుకోవాలని విపరీత నిర్ణయం తీసుకున్నాడు. శనివారం ఉదయం తన పొలంలోని బావి వద్దకు వెళ్లి గొడ్డలితో ఆ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం తీవ్ర రక్తస్రావం అవుతున్నా, ఆయనే స్వయంగా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పారు.
హఠాత్తుగా ఫోన్ రావడంతో షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే పొలం వద్దకు పరుగులు తీశారు. అక్కడ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న అతడిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే అతడిని ఛతర్‌పుర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. శరీరంలో కీలక భాగం కోసుకుపోవడం వల్ల తీవ్రంగా రక్తస్రావం జరిగిందని, ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యుడు డాక్టర్ మనోజ్ చౌధరి తెలిపారు. నిపుణులైన వైద్య బృందం అతడికి చికిత్స అందిస్తోందని చెప్పారు.
బాధిత రైతుకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన భార్య కొన్నేళ్లుగా పక్షవాతంతో మంచానికే పరిమితమైంది. దీనికి తోడు పెద్ద కుమార్తె వివాహం జూన్ 25న జరగాల్సి ఉంది. ఒకవైపు భార్య చికిత్స, మరోవైపు కూతురి పెళ్లి బాధ్యతలు, వీటికి తోడు ఆర్థిక ఇబ్బందులు అతడిని తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. ఈ కష్టాల నుంచి తప్పించుకునే మార్గంలేకనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.