నేడు ఐపీఎల్ ఫైనల్.. వర్షం పడితే ఎవరు విజేత?

Royal Challengers Bangalore vs Gujarat Titans IPL Final 2026 What if Rain
  • అహ్మదాబాద్‌లో నేడు ఐపీఎల్ 2026 ఫైనల్‌
  • తలపడనున్న ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్లు
  • రెండో టైటిల్ కోసం ఇరు జట్లు పోరాటం 
  • వర్షంతో మ్యాచ్ పూర్తిగా రద్దయితే ఆర్సీబీకే చాన్స్
ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు (ఆదివారం) జరగనున్న టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్లు తమ రెండో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలగా ఉన్నాయి. గతేడాది ఇదే వేదికపై పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తమ దశాబ్దాల టైటిల్ కలను నెరవేర్చుకున్న ఆర్సీబీ.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.

మరోవైపు, గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఐదేళ్లలో ఇది మూడో ఫైనల్ కావడం విశేషం. 2022లో అరంగేట్రం చేసిన తొలి సీజన్‌లోనే విజేతగా నిలిచిన గుజరాత్, 2023 ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలని పట్టుదలగా ఉంది.

వర్షం అంతరాయం కలిగిస్తే?
మ్యాచ్ జరిగే అహ్మదాబాద్‌లో ఆదివారం వర్షం పడే అవకాశం కేవలం 5 శాతమేనని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ అనుకోని రీతిలో వర్షం అంతరాయం కలిగిస్తే.. ఫైనల్ కోసం బీసీసీఐ సోమవారం (జూన్ 1) రిజర్వ్ డేను కేటాయించింది. ఆదివారం ఆట ఎక్కడైతే ఆగిపోతుందో, సోమవారం అక్కడి నుంచే తిరిగి ప్రారంభిస్తారు. ఒకవేళ ఆదివారం, సోమవారం రెండు రోజులూ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే, లీగ్ దశలో పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ నిబంధన ప్రకారం ఆర్సీబీ టైటిల్ కైవసం చేసుకుంటుంది.

ఫైనల్‌కు ఇలా...
ఈ సీజన్‌లో ఆర్సీబీ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌ను 92 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. ఓటమిపాలైన గుజరాత్, క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టింది.

ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధిస్తే, ఆ జట్టు కెప్టెన్ రజత్ పటీదార్ ఓ అరుదైన ఘనతను అందుకుంటాడు. ఎంఎస్ ధోనీ (చెన్నై), రోహిత్ శర్మ (ముంబై) తర్వాత వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన మూడో కెప్టెన్‌గా చరిత్ర సృష్టిస్తాడు. దీంతో ఈ ఫైనల్ పోరుపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Go Back to Shorts
Royal Challengers Bangalore
RCB vs GT
IPL Final 2026
Gujarat Titans
Rajat Patidar
Narendra Modi Stadium
Ahmedabad Weather
IPL Winner Prediction
IPL Reserve Day
IPL Points Table

More Telugu News