అమెరికా డ్రోన్‌ను కూల్చివేసిన ఇరాన్.. ముదురుతున్న ఉద్రిక్తతలు
- అమెరికా ఎంక్యూ-1 డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటన
- తమ జలాల్లోకి శత్రుత్వ కార్యకలాపాల కోసం రావడంతోనే కూల్చామని వెల్లడి
- గతవారం కూడా ఒక అమెరికన్ డ్రోన్‌ను కూల్చివేశామన్న ఇరాన్
- ఇరాన్‌పై ఆత్మరక్షణ దాడులు చేశామని అమెరికా ప్రకటన
- పరస్పర దాడులతో ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయికి ఉద్రిక్తతలు
ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు పెరిగాయి. గత మంగళవారం కూడా అమెరికాకు చెందిన ఎంక్యూ-9 డ్రోన్‌ను తమ గగనతల రక్షణ విభాగాలు కూల్చివేశాయని ఐఆర్‌జీసీ తెలిపింది. అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ప్రతీకారం తీర్చుకునే హక్కు తమకు ఉందని అప్పుడే ఇరాన్ హెచ్చరించింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన ఒక యుద్ధ విమానంపై కూడా కాల్పులు జరిపినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.
మరోవైపు, ఇరాన్‌పై తాము ‘ఆత్మరక్షణ దాడులు’ చేసినట్లు అమెరికా ప్రకటించింది. సోమవారం దక్షిణ ఇరాన్‌లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్‌లను అమర్చేందుకు ప్రయత్నిస్తున్న పడవలపై దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్రకామ్) తెలిపింది. "మా దళాలను ఇరాన్ నుంచి వచ్చే ముప్పుల నుంచి కాపాడుకోవడానికే ఈ దాడులు నిర్వహించాం. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ, మా దళాల రక్షణకు కట్టుబడి ఉన్నాం" అని సెంట్రకామ్ ప్రతినిధి టిమ్ హాకిన్స్ ఒక ప్రకటనలో తెలిపారు.
అంతేకాకుండా, గురువారం రాత్రి కూడా ఇరాన్‌లోని ఒక సైనిక స్థావరంపై అమెరికా దాడులు నిర్వహించింది. ఈ స్థావరం అమెరికా దళాలకు, వాణిజ్య నౌకలకు ముప్పుగా పరిణమించిందని వాషింగ్టన్ పేర్కొంది. ఇదిలా ఉండగా, గురువారం తెల్లవారుజామున హర్మూజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ ఓడరేవు నగరం బందర్ అబ్బాస్‌కు తూర్పున మూడు భారీ పేలుళ్లు వినిపించినట్లు ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ రిపోర్ట్ చేసింది. ఇరాన్ అణు కార్యక్రమం తమకు ముప్పుగా పరిణమించిందని, అణ్వాయుధాలను అభివృద్ధి చేయాలని చూస్తోందనే కారణంతోనే ఇజ్రాయెల్‌తో కలిసి ఈ పోరాటం చేస్తున్నామని అమెరికా వాదిస్తోంది.