బీఆర్ఎస్ డ్రామాలో బాల్క సుమన్ బలిపశువు: అద్దంకి దయాకర్
- రైలు పట్టాలు కోయాలని, దాడులు చేయాలని చెప్పడం కేసీఆర్ నైజమన్న దయాకర్
- అధికారం కోసం బీఆర్ఎస్ ఎంతకైనా తెగిస్తుందని మండిపాటు
- బాల్క సుమన్ తో ఈ వ్యాఖ్యలు ఎవరు చేయించారో తేల్చాలని డిమాండ్
బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బలయ్యాడని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇటీవల బీఆర్ఎస్ నేతలు వాడుతున్న భాష, అగ్రనాయకత్వం అనుసరిస్తున్న రాజకీయ శైలిపై తీవ్రంగా మండిపడ్డారు.
రైలు పట్టాలు కోయాలని, దాడులు చేయాలని పిలుపునివ్వడం ముమ్మాటికీ కేసీఆర్ నైజమని దయాకర్ విమర్శించారు. "కేసీఆర్ తనకు తెలిసిన కుటిల రాజకీయాన్ని కేటీఆర్‌కు నేర్పితే.. కేటీఆర్ అదే విషయాన్ని బాల్క సుమన్‌కు నూరిపోశారు. కాళేశ్వరంలో తప్పులు చేసి, ఫార్ములా రేస్ నిధుల దుర్వినియోగంపై విచారణకు వెళుతూ కూడా 'జై తెలంగాణ' అనడం బీఆర్ఎస్ నేతలకే చెల్లింది" అని ఎద్దేవా చేశారు.
ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు, రైతులను రెచ్చగొట్టడమే అజెండాగా పెట్టుకున్న బీఆర్ఎస్, అధికారం కోసం ఎంతకైనా తెగిస్తుందని దయాకర్ ధ్వజమెత్తారు. బాల్క సుమన్‌తో ఈ తరహా వ్యాఖ్యలు చేయించిన అసలు సూత్రధారులెవరో పోలీస్ అధికారులు సమగ్ర విచారణ జరిపి తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.