తిరుమల శ్రీవారికి ఖరీదైన బస్సు విరాళంగా ఇచ్చిన భక్తురాలు
- రూ.1.13 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ బస్సు విరాళమిచ్చిన నీరా రాడియా
- బస్సుతో పాటు 15 ట్యాబ్ల అందజేత
- భక్తుల కోసం నడుపుతున్న ధర్మరథం సేవలో చేరనున్న కొత్త బస్సు
- దాతకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ధన్యవాదాలు
నేడు తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఈ కొత్త బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాత నీరా రాడియా, బస్సు తాళాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ.. దాతృత్వానికి నిదర్శనంగా నిలిచిన నీరా రాడియాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కొత్త బస్సును తిరుమలలో భక్తుల కోసం నడుపుతున్న ఉచిత 'ధర్మరథం' సర్వీసులో చేర్చనున్నారు. ప్రస్తుతం ధర్మరథం సేవలో 20 బస్సులు ఉండగా, వాటిలో 14 ఇప్పటికే విద్యుత్ బస్సులే. ఈ బస్సులు 21 బస్ స్టాప్ల మీదుగా రోజూ 380 ట్రిప్పులు తిరుగుతూ భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయి. త్వరలోనే మిగిలిన డీజిల్ బస్సుల స్థానంలో కూడా పూర్తిగా విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడమే తమ లక్ష్యమని టీటీడీ ఛైర్మన్ వివరించారు. ఈ విరాళం ఆ లక్ష్య సాధనకు మరింత ఊతమివ్వనుంది.