బ్రిటన్‌లో భారతీయులపై విద్వేషం.. ఉద్యోగాలు లాక్కుంటున్నారన్న ఎంపీ రూపర్ట్ లోవ్
- బ్రిటన్‌లోని ఉద్యోగాలను భారతీయులు, పాకిస్థానీయులు లాక్కుంటున్నారన్న ఎంపీ రూపర్ట్ లోవ్
- బురఖా, షరియా కోర్టులు, ఖడ్గం, హలాల్‌ను నిషేధిస్తామని సంచలన ప్రకటన
- రూపర్ట్ పోస్టులను ఎలాన్ మస్క్ రీపోస్ట్ చేయడంతో పెరిగిన దుమారం
- వచ్చే నెలలో జరగనున్న మేకర్‌ఫీల్డ్ ఉప ఎన్నికల నేపథ్యంలో విద్వేష ప్రచారం
వివరాల్లోకి వెళితే.. నైజెల్ ఫరాజ్ నేతృత్వంలోని 'రిఫార్మ్ యూకే' పార్టీ తరఫున గ్రేట్ యార్మౌత్ నుంచి ఎంపీగా ఎన్నికైన రూపర్ట్ లోవ్, అంతర్గత విభేదాల కారణంగా గతేడాది సస్పెన్షన్‌కు గురయ్యారు. అనంతరం 'రీస్టోర్ బ్రిటన్' పేరుతో సొంతంగా ఓ ఫార్-రైట్ పార్టీని స్థాపించారు. వచ్చే నెలలో మేకర్ఫీల్డ్లో కీలక ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో, ఆయన చేస్తున్న ఆన్లైన్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో కొన్ని పోస్టులను రీపోస్ట్ చేయడంతో వీటికి మరింత ప్రచారం లభించింది.
"నిరుద్యోగ బ్రిటన్ ప్రజలు చేయాల్సిన ఉద్యోగాల కోసం లక్షలాది మంది పాకిస్థానీయులను, భారతీయులను దిగుమతి చేసుకోవాలని నేను నమ్మను. నన్ను జాత్యహంకారి అని పిలిచినా పర్వాలేదు. నేను నిజాలే మాట్లాడతాను" అని గురువారం రూపర్ట్ లోవ్ పోస్ట్ చేశారు. అంతకుముందు "ఇంగ్లండ్‌లో నివసించే విదేశీ పౌరులు ఇంగ్లీష్ మాట్లాడాలని, తీసుకునేదాని కంటే ఎక్కువ ఇవ్వాలని ఆశించడం జాత్యహంకారం కాదు" అని మరో పోస్ట్‌లో పేర్కొన్నారు.
తన విద్వేషపూరిత అజెండాను మరింత ముందుకు తీసుకెళ్తూ.. ముస్లిం, సిక్కు వర్గాలను లక్ష్యంగా చేసుకుని సంచలన ప్రకటనలు చేశారు. "బురఖా, షరియా కోర్టులు, కజిన్ మ్యారేజ్, హలాల్ మాంసాన్ని నిషేధిస్తాం. రీస్టోర్ బ్రిటన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బహిరంగ ప్రదేశాల్లో ఖడ్గం (కిర్పాన్) వాడకాన్ని కూడా నిషేధిస్తుంది. అందరికీ ఒకే నియమం ఉండాలి" అని ఆయన ప్రకటించారు. మాంచెస్టర్‌లోని కొన్ని ప్రాంతాలు ఇస్లామిక్ కాలనీలుగా మారుతున్నాయని, ఇది ఒకరకమైన వలసీకరణ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జూన్ 18న జరగనున్న మేకర్‌ఫీల్డ్ ఉప ఎన్నిక బ్రిటన్ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచి హౌస్ ఆఫ్ కామన్స్‌లో అడుగుపెట్టాలని లేబర్ పార్టీకి చెందిన గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ ఆండీ బర్న్‌హామ్ ప్రయత్నిస్తున్నారు. అయితే, 'రిఫార్మ్ యూకే' మరియు 'రీస్టోర్ బ్రిటన్' పార్టీల మధ్య ఫార్-రైట్ ఓట్లు చీలిపోవడం లేబర్ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.