తెలంగాణలో జపాన్ మామిడి... రూ.10 వేల మొక్కతో లక్షల పంట

Telangana Doctor Cultivates Rare Miyazaki Mangoes
  • నిర్మల్ జిల్లాలో జపాన్ మియాజకి మామిడి సాగు
  • నవాబుపేటలో ఆయుర్వేద వైద్యుడు సత్యం విజయవంతం
  • వాతావరణం అనుకూలించదన్నా వెనక్కి తగ్గని పట్టుదల
  • కేరళ నుంచి ఒక్కో మొక్కను రూ.10 వేలకు కొనుగోలు
  • నాటిన ఆరు మొక్కలలో ఐదు విజయవంతంగా పెరుగుదల
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకంగా పేరుగాంచిన జపాన్‌కు చెందిన మియాజకి మామిడి పండ్లను తెలంగాణ నేలపై విజయవంతంగా పండించి ఓ ఆయుర్వేద వైద్యుడు అందరినీ ఆశ్చర్యపరిచారు. నిర్మల్ జిల్లా కడెం మండలం నవాబుపేట గ్రామంలో ఈ అరుదైన ప్రయోగం ఫలించింది.

వివరాల్లోకి వెళ్తే, నవాబుపేట గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ రాపల్లి సత్యం ఈ ఘనత సాధించారు. మియాజకి రకం మామిడి సాధారణంగా శీతల వాతావరణంలో మాత్రమే పెరుగుతుందని, స్థానిక ఉష్ణోగ్రతలకు తట్టుకోదని కొందరు వారించారు. అయినప్పటికీ, ఆ హెచ్చరికలను పక్కనపెట్టి పట్టుదలతో ప్రయత్నించి చూడాలని ఆయన నిర్ణయించుకున్నారు.

ఇందుకోసం కేరళలోని ఓ ఏజెన్సీ ద్వారా ఒక్కో మొక్కకు రూ.10 వేలు ఖర్చు చేసి మొత్తం ఆరు మియాజకి మొక్కలను కొనుగోలు చేశారు. వాటిని తన సత్యం ట్రెడిషనల్ ఆయుర్వేద ఆశ్రమం ప్రాంగణంలో నాటగా, ఒక మొక్క చనిపోయింది. మిగిలిన ఐదు మొక్కలు మాత్రం స్థానిక వాతావరణానికి తట్టుకుని ఏపుగా పెరిగి ఫలసాయాన్ని అందించాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ఈ మామిడి పండ్లు అత్యధిక ధరను పలుకుతుంటాయి. కిలోకు రూ.2.5 లక్షల నుంచి రూ.2.8 లక్షల వరకు ఉంటుంది. శుక్రవారం తన ఆశ్రమ ప్రాంగణంలో పండిన ఈ మామిడి పళ్లను స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌కు డాక్టర్ రాపల్లి సత్యం అందించారు. ఎంతో ఖరీదైన, అరుదైన ఈ మామిడి రకాన్ని తెలంగాణ గడ్డపై విజయవంతంగా పండించడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.
Go Back to Shorts
Rapalli Satyam
Miyazaki mango
Telangana
Japan mango
Nawabpet
Kadim Mandal
expensive mango
Bojju Patel

More Telugu News