ఇరాన్‌తో ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన.. హర్మూజ్ జలసంధిపై దిగ్బంధనం ఎత్తివేత
- అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంలో కీలక పురోగతి
- హర్మూజ్ జలసంధిపై నావికా దిగ్బంధనం ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన
- చిక్కుకుపోయిన నౌకలు ఇళ్లకు బయల్దేరవచ్చని పిలుపు
- ట్రంప్ ప్రకటనలో నిజాలు, అబద్ధాలు ఉన్నాయన్న ఇరాన్
- ఒప్పందంలో భాగంగా 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు
ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ వివరాలను వెల్లడించారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదని, జలసంధిలో అమర్చిన మైన్‌లను తొలగించాలని షరతులు విధించినట్లు తెలిపారు. దిగ్బంధనం కారణంగా చిక్కుకుపోయిన నౌకలు ఇక తమ ఇళ్లకు బయల్దేరవచ్చని పేర్కొన్నారు. "మీ భార్యలు, భర్తలు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు.. మీకు ఇష్టమైన ప్రెసిడెంట్ అయిన నా తరఫున 'హలో' చెప్పండి!" అని ట్రంప్ తనదైన శైలిలో సందేశమిచ్చారు. ఈ ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు సిట్యుయేషన్ రూమ్‌లో సమావేశమవుతున్నట్లు ఆయన సూచించారు.
ప్రస్తుత ఒప్పంద ముసాయిదా ప్రకారం 60 రోజుల పాటు కాల్పుల విరమణను పొడిగించడం, హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు లేకుండా చూడటం, అంతర్జాతీయ పర్యవేక్షణలో ఇరాన్ వద్దనున్న అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను నిర్మూలించడం వంటి అంశాలు ఉన్నాయి. తదుపరి నోటీసు వచ్చేవరకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు ఉండవని తెలుస్తోంది.
పైసా ఇచ్చేది లేదు.. నిధుల బదిలీపై బ్రేక్!
యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి గానూ అమెరికా నుంచి ఇరాన్ భారీగా ఆర్థిక పరిహారం డిమాండ్ చేస్తోందని, ఇందుకు వైట్‌హౌస్ కూడా పెట్టుబడుల రూపంలో కొంత మొగ్గు చూపుతోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వార్తలపై డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. "తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి నగదు మార్పిడి జరగదు" అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య అత్యంత సాధారణ, తక్కువ ప్రాధాన్యం కలిగిన అంశాలపై మాత్రమే ఏకాభిప్రాయం కుదిరిందని, ప్రధానమైన నిబంధనలపై సిట్యుయేషన్ రూమ్ సమావేశం తర్వాతే పూర్తి స్పష్టత వస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.
అయితే, ట్రంప్ ప్రకటనపై ఇరాన్ అధికారులు ఆచితూచి స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యల్లో కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలు కలిపి ఉన్నాయని, ఇంకా తుది ఒప్పందం కుదరలేదని వారు స్పష్టం చేశారు. జలసంధిపై తమకు సార్వభౌమాధికారం ఉందని, అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయని అంగీకరించారు.
ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు హర్మూజ్ జలసంధి అత్యంత కీలకమైన మార్గం. ఇరు దేశాల మధ్య ఘర్షణల కారణంగా ఈ మార్గం మూసివేతతో అంతర్జాతీయంగా ఇంధన మార్కెట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాజా నిర్ణయంతో అంతర్జాతీయ వాణిజ్యానికి ఉపశమనం లభించి, ఇంధన ధరలు స్థిరపడతాయని నిపుణులు భావిస్తున్నారు. ఏప్రిల్‌లో కుదిరిన బలహీనమైన కాల్పుల విరమణ తర్వాత ఈ శాంతి ప్రయత్నాలు ముమ్మరం కావడం గమనార్హం.