రాష్ట్రంలో ఈ ఏడాది చివరికి మూడు పోర్టులు ప్రారంభం అవుతాయి: మంతెన రామరాజు

  • మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం
  • గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేశారని రామరాజు విమర్శ
  • భోగాపురం ఎయిర్‌పోర్టు ఘనత చంద్రబాబుదేనని స్పష్టీకరణ
  • రాష్ట్రంలో 9 గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ప్రణాళికలు
  • ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు లక్ష్యం
తెలుగుదేశం పార్టీ మహానాడు-2026 వేదికగా రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసింది. రెండో రోజు మహానాడులో భాగంగా 'రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, అమరావతి' వంటి అంశాలపై ప్రవేశపెట్టిన తీర్మానంపై ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు ప్రసంగించారు. రాష్ట్రంలో పోర్టుల నిర్మాణ పనులను వేగవంతం చేశామని, మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులను ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. 

రూ.29,253 కోట్ల వ్యయంతో దుగరాజపట్నంలో భారీ గ్రీన్‌ఫీల్డ్ పోర్టు, మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై మంతెన రామరాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి తన విధానాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ పారిపోయేలా చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం పోర్టుల పనులను గాలికి వదిలేయడం వల్లే అనేక పరిశ్రమలు రాష్ట్రం విడిచి వెళ్లాయని, పోర్టులపై ఆధారపడిన పరిశ్రమలు నిలిచిపోయాయని అన్నారు. తమ ప్రభుత్వం ఆ పనులను ఇప్పుడు పునఃప్రారంభించిందని వివరించారు. 

కాకినాడ గేట్‌వే పోర్టును 2028 సెప్టెంబర్ నాటికి ప్రారంభిస్తామని, తీరప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ నిర్మించాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు.

ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపైనా ఆయన స్పష్టత ఇచ్చారు. 2014-19 మధ్య చంద్రబాబు భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రతిపాదిస్తే.. 'భోగాపురానికి ఎర్రబస్సే గతి, ఎయిర్‌పోర్టు ఎందుకు' అని వైసీపీ నేతలు ఎద్దేవా చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు తాము ఆ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తుంటే, దానిని తామే నిర్మించామని వైసీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. భోగాపురం భూముల సమస్యలను మాన్సాస్ ట్రస్ట్ ద్వారా పరిష్కరించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. భోగాపురాన్ని ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. 

రాష్ట్రంలో కొత్తగా 9 గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, నెల్లూరు విమానాశ్రయాన్ని పీపీపీ పద్ధతిలో టెండర్ల దశకు తీసుకొచ్చామని వివరించారు. విజన్-2047 లక్ష్య సాధనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పర్యాటక రంగంతో పాటు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని మంతెన రామరాజు ధీమా వ్యక్తం చేశారు.

Mantena Ramaraju
Andhra Pradesh ports
AP ports development
Machilipatnam port
Ramayapatnam port
Dugarajapatnam port
Bhogaouram airport
AP new airports
TDP Mahanadu 2026
Chandrababu Naidu

More Telugu News