భూమి అమ్మి భార్యను చదివించాడు.... ఉద్యోగం రాగానే ప్రియుడితో వెళ్లిపోయిన భార్య!

  • బీహార్‌లోని హాజీపూర్‌లో దారుణం
  • ప్రియుడి కోసం భర్త, 10 ఏళ్ల కుమారుడిని వదిలి వెళ్లిన భార్య
  • భార్య కలను నెరవేర్చడం కోసం ఆస్తులు అమ్మి చదివించిన భర్త
తన భార్యకు ఉద్యోగం వచ్చిన తర్వాత తనను, తమ 10 సంవత్సరాల కుమారుడిని వదిలి వెళ్లిపోయిందని బీహార్‌లోని హాజీపూర్‌కు చెందిన ఒక వ్యక్తి ఆరోపించాడు. తన భార్య చదువు కోసం తాను పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని విక్రయించానని, కానీ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చాక  తమకు అన్యాయం చేసిందని వాపోయాడు.  ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

హాజీపూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమన్ కుమార్, గుంజన్ కుమారిలకు 2013లో వివాహమైంది. వివాహం తర్వాత తన భార్యను ఉన్నత చదువులు చదివించాలని ఆశించాడు. ఆమె చదువుకు ఇబ్బందులు ఎదురుకాకూడదని పట్టణంలో ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి చదివించాడు. ఆమె చదువు కోసం ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడటంతో తనకు పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని విక్రయించాడు.

ఆమె గ్రాడ్యుయేషన్, బీఈడీ పూర్తి చేసిన అనంతరం బీపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చాక ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఉపాధ్యాయ శిక్షణ సమయంలో ఆమె కాలేజీ రోజుల్లోని పాత మిత్రుడిని తిరిగి కలుసుకుంది. ఆది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఉద్యోగం వచ్చాక భార్య ప్రవర్తనలో మార్పును భర్త గమనించాడు. ఈ నెల 23వ తేదీన అద్దె ఇంట్లో ఉంటున్న తన భార్య వద్దకు వెళ్లాడు. ప్రియుడితో కలిసి ఉండగా రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహిళతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే తాను భర్తతో ఉండలేనని, ప్రియుడితోనే ఉంటానని ఆమె చెబుతోందని పోలీసులు వెల్లడించారు.

తన భార్య ఇంటర్మీడియట్ చదివిందని, ఉపాధ్యాయురాలు కావాలని కలలు కనడంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చదివించి, ఆమె కలను నెరవేర్చానని భర్త వాపోయాడు. ఆమె కలను నెరవేర్చడానికి తాను 2022లో తన ఒకటిన్నర ఎకరాల భూమిని విక్రయించినట్లు చెప్పాడు.

Aman Kumar
Bihar wife cheating
Hajipur
Teacher affair
Wife elopes with lover
Property sold for education

More Telugu News