హైదరాబాద్ టెక్కీ ఇంట్లో దొంగతనం.. ఫిర్యాదు చేసిన టెక్కీపైనే సొసైటీ పెద్దల ఫైర్!

Hyderabad Techie Alleges Harassment After Reporting Apartment Theft
  • హైదరాబాద్‌లో టెక్కీ ఇంట్లో చోరీ
  • సీసీ కెమెరాలు పనిచేయడం లేదని వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్
  • సొసైటీ పరువు తీస్తున్నావంటూ టెక్కీపై నిర్వాహకుల ఆగ్రహం
  • పలు నగరాల్లో ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయన్న నెటిజన్లు
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన
హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హౌసింగ్ సొసైటీలో ఓ టెక్కీకి విచిత్రమైన అనుభవం ఎదురైంది. తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేస్తే, దానికి పరిష్కారం చూపాల్సింది పోయి, తనపైనే సొసైటీ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌కు చెందిన శ్రవణ్ వెంకటరామన్ అనే టెక్కీ నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌లో చోరీ జరిగింది. దీనిపై ఆయన రెసిడెంట్స్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసి, దర్యాప్తు కోసం సీసీటీవీ ఫుటేజ్ కావాలని కోరారు. అయితే, అప్పుడే ఆసక్తికర విషయం బయటపడింది. సొసైటీలోని సెక్యూరిటీ కెమెరాలు పనిచేయడం లేదని, ఈ విషయం తమకు కూడా ఇప్పుడే తెలిసిందని మేనేజర్ సమాధానమిచ్చారు.

దీంతో అప్రమత్తమైన శ్రవణ్, భద్రతా లోపం గురించి నివాసితులను హెచ్చరిస్తూ, రక్షణ కోసం సొంతంగా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గ్రూప్‌లో సూచించారు. ఇది జరిగిన మరుసటి రోజే సొసైటీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు అతడిని క్లబ్‌హౌస్‌కు పిలిపించారు. దొంగతనం గురించి చర్చించకుండా, "సొసైటీ పరువు తీస్తున్నావ్, అందరి స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నావ్" అంటూ తనపై గట్టిగా అరిచారని శ్రవణ్ ఆరోపించారు.

ఈ క్రమంలో ఉపాధ్యక్షుడు, "ఈరోజు ఖరీదైన చెప్పులు పోయాయంటారు, రేపు అండర్‌వేర్ పోయిందంటారు. వాటన్నిటికీ మేం బాధ్యత తీసుకోలేం" అని నిర్లక్ష్యంగా వ్యాఖ్యానించినట్లు శ్రవణ్ తెలిపారు. వారి ప్రవర్తనతో విసిగిపోయిన ఆయన, వాట్సాప్ గ్రూప్ నుంచి బయటకు వచ్చి తన అనుభవాన్ని 'ఎక్స్'లో పంచుకున్నారు. ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో, ముంబై వంటి నగరాల్లోని అనేక మంది తాము కూడా ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నామని కామెంట్లు పెడుతున్నారు. 
Go Back to Shorts
Shravan Venkatraman
Hyderabad
apartment theft
housing society
security cameras
residents welfare association
cyberabad
techie
society president
society vice president

More Telugu News