మహానాడు అనేది కేవలం ఒక సామాన్య సభ కాదు: బైరెడ్డి శబరి
- పసుపు సైన్యం గర్జన మహానాడు అన్న శబరి
- టీడీపీ కార్యకర్తల ఇంట్లో యోధులు పుడతారని వ్యాఖ్య
- వైసీపీ విధ్వంసకర పాలనతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్న శబరి
తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కేవలం ఒక సామాన్య సభ కాదని, అది పసుపు సైన్యం గర్జన అని టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి అభివర్ణించారు. మహానాడు వేదికగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన ఆమె, కార్యకర్తలపై ప్రశంసల జల్లు కురిపిస్తూ సభలో సరికొత్త ఉత్తేజాన్ని నింపారు. ఈ సందర్భంగా బైరెడ్డి శబరి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. "ప్రతి ఇంట్లో పిల్లలు పుడతారు.. కానీ తెలుగుదేశం కార్యకర్తల ఇంట్లో మాత్రం యోధులు పుడతారు" అంటూ ఆమె వ్యాఖ్యానించారు. తామంతా పార్టీ కోసం, తమ అధినేత చంద్రబాబు కోసం, పార్టీ ఆశయాల కోసమే అంకితభావంతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచకాలు జరిగాయంటూ ఆమె ఈ వేదికపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ విధ్వంసకర పాలన వల్ల సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, బాధపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే గత ఐదేళ్లలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమంగా తప్పుడు కేసులు బనాయించి, తీవ్రంగా హింసించారని ఎంపీ బైరెడ్డి శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి వేధింపులను తట్టుకుని నిలబడిన కార్యకర్తల అండతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆమె కొనియాడారు.