హైదరాబాద్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. ఒక్కరోజులోనే రూ.4,117 కోట్ల విలువైన భూములకు విముక్తి

Hydra Operation Hyderabad Recovers Lands Worth 4117 Crore
  • కోకాపేట, ఖానామెట్ ప్రాంతాల్లోని చెరువు కబ్జాలను అడ్డుకున్న హైడ్రా
  • ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు చేపట్టిన అక్రమ నిర్మాణాల బట్టబయలు
  • ఒక్క కోకాపేటలోనే రూ.3,000 కోట్లకు పైగా విలువైన భూములకు విముక్తి
  • కబ్జాకు గురైన చెరువులను, రోడ్డు స్థలాలను స్వాధీనం చేసుకుని కంచె ఏర్పాటు
హైదరాబాద్ మహానగరంలో అత్యంత ఖరీదైన ఐటీ కారిడార్, కోకాపేట పరిసరాల్లో ప్రభుత్వ భూములు, చెరువులను కబ్జా చేస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియాపై 'హైడ్రా' ఉక్కుపాదం మోపింది. మార్కెట్‌లో ఎకరం రూ.150 కోట్లకు పైగా పలికే ఈ ప్రాంతాల్లో బడా రియల్టర్లు పక్కా ప్రణాళికతో సాగిస్తున్న భూదందాకు అడ్డుకట్ట వేసింది. నిన్న‌ నగరం నలువైపులా ఏకకాలంలో భారీ ఆపరేషన్ నిర్వహించి, సుమారు రూ.4,117 కోట్ల విలువైన ప్రభుత్వ, చెరువు శిఖం భూములను స్వాధీనం చేసుకుంది. ఆక్రమణలను తొలగించి, ఆ భూముల చుట్టూ రక్షణ కంచెలను ఏర్పాటు చేసింది.

కోకాపేటలో బట్టబయలైన బడా సంస్థల అక్రమాలు
ఈ ఆపరేషన్‌లో భాగంగా కోకాపేటలో ప్రముఖ స్థిరాస్తి సంస్థలు సాగిస్తున్న అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కొత్తచెరువు పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్‌టీఎల్) పరిధిలోని 1.09 ఎకరాల భూమిని ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆక్రమించుకుంది. 'గోల్డ్‌ఫిష్ కాలనీ' పేరుతో అక్కడ విల్లాలను నిర్మించడమే కాకుండా మిగిలిన చెరువు భాగాన్ని మట్టితో పూడ్చివేసి నివాసితుల కోసం లగ్జరీ గార్డెన్లు, బాస్కెట్‌బాల్, వాలీబాల్ కోర్టులు నిర్మించింది. స్థానికులు ప్రజావాణిలో చేసిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన హైడ్రా అధికారులు, అది చెరువు భూమి అని నిర్ధారించుకుని అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఇదే ప్రాంతంలోని పెద్దచెరువు పరిధిలో బహుళ అంతస్తుల భవనాల కోసం ఆక్రమించిన సుమారు 22 ఎకరాల స్థలాన్ని కూడా అధికారులు కాపాడారు. ఒక్క కోకాపేటలోనే స్వాధీనం చేసుకున్న భూముల విలువ రూ.3,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

మ్యాప్ నుంచే చెరువును మాయం చేసే కుట్ర భగ్నం
మరోవైపు శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లోని ఈదులకుంట చెరువును ఏకంగా మ్యాప్ నుంచే తొలగించేందుకు జరిగిన భారీ కుట్రను హైడ్రా భగ్నం చేసింది. తమ్మిడికుంట చెరువు నిండినప్పుడు వచ్చే వరద నీటి కాలువను కబ్జాదారులు దారి మళ్లించి, చెరువు ఎండిపోయేలా చేశారు. ఆ తర్వాత ఆ స్థలంలో భారీ ఆకాశహర్మ్యాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు కూడా విచారణలో ఉంది. హైడ్రా అధికారులు శాటిలైట్ చిత్రాలు, పాత ఎఫ్‌టీఎల్ రికార్డుల ఆధారంగా 6.50 ఎకరాల చెరువు స్థలాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ రూ.600 కోట్లు. దీనికి ఆనుకుని ఉన్న రూ.500 కోట్ల విలువైన 5.16 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా అధికారులు కాపాడారు.

రోడ్డు స్థలాన్నీ వదలని కబ్జాదారు
భరత్‌నగర్-హఫీజ్‌పేట్ మార్గంలోనూ మరో కబ్జా వెలుగు చూసింది. రోడ్డు విస్తరణ కోసం జీహెచ్‌ఎంసీ భూసేకరణ చేసి, పరిహారం చెల్లించినప్పటికీ.. ఓ భూయజమాని 1700 గజాల స్థలాన్ని అప్పగించకుండా దానిపై కార్యాలయం, గోశాల నిర్మించాడు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో ఫిర్యాదులు అందాయి. స్పందించిన హైడ్రా అధికారులు ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేసి రూ.17 కోట్ల విలువైన స్థలాన్ని రోడ్డు విస్తరణకు అప్పగించారు. ఈ మెగా ఆపరేషన్‌తో భూకబ్జాదారులకు ప్రభుత్వం స్పష్టమైన హెచ్చరికలు పంపినట్లయింది.
Go Back to Shorts
Hydra
Hyderabad
Kokapet
Land Encroachment
Real Estate Mafia
Telangana Government
Shaikpet
Serilingampally
KhanaMet
Nallagandla

More Telugu News