ఐపీఎల్-2026 ఫైనల్లోకి దూసుకెళ్లిన ఆర్సీబీ... గుజరాత్ కు మరో చాన్స్

Royal Challengers Bangalore Reach IPL 2026 Final Defeating Gujarat
  • క్వాలిఫయర్-1లో గుజరాత్‌పై ఆర్సీబీ 92 పరుగుల భారీ విజయం
  • ఐపీఎల్ 2026 ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించిన బెంగళూరు
  • 33 బంతుల్లో 93 పరుగులు చేసి కెప్టెన్ రజత్ పటీదార్ విధ్వంసం
  • గుజరాత్ తరఫున రాహుల్ తెవాటియా ఒంటరి పోరాటం
  • ఓడినా గుజరాత్ టైటాన్స్‌కు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం
డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ 2026 సీజన్‌లో నేరుగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 92 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించి టైటిల్ సమరానికి సిద్ధమైంది. కెప్టెన్ రజత్ పటీదార్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించింది. మరోవైపు, ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ గుజరాత్ టైటాన్స్‌కు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో ఆ జట్టు క్వాలిఫయర్-2లో తలపడనుంది.

ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకోగా, ఆర్సీబీ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు సాధించారు. వెంకటేశ్ అయ్యర్ (19) మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా, విరాట్ కోహ్లీ (43), దేవదత్ పడిక్కల్ (30) కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వీరిద్దరిని ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చి హోల్డర్ గుజరాత్‌కు కాస్త ఊరటనిచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 33 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో అజేయంగా 93 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. కృనాల్ పాండ్య (43) కూడా రాణించడంతో ఆర్సీబీ భారీ స్కోరు చేసింది.

అనంతరం 255 పరుగుల కొండంత లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ ఆరంభంలోనే తడబడింది. సాయి సుదర్శన్ (14), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (2) త్వరగా ఔటయ్యారు. జోస్ బట్లర్ (29) వేగంగా ఆడే ప్రయత్నం చేసినా ఎక్కువసేపు నిలవలేదు. ఒక దశలో 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి గుజరాత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో రాహుల్ తెవాటియా (68) ఒంటరి పోరాటం చేశాడు. 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో గుజరాత్ పరువు నిలిపే ప్రయత్నం చేశాడు. కానీ అతనికి ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందలేదు. 

ఆర్సీబీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఆర్సీబీ బౌలర్లలో జాకబ్ డఫీ 3 వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్య, రసిఖ్ సలామ్ దార్ తలా రెండు వికెట్లు తీశారు.

రేపు (మే 27) సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుతో మే 29న క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. 
Go Back to Shorts
Royal Challengers Bangalore
RCB
Rajat Patidar
Gujarat Titans
IPL 2026
Indian Premier League
Cricket
Dharamshala
Qualifier 1
Rahul Tewatia

More Telugu News