వైఎస్ కుటుంబంతో మొదలైన హత్యా రాజకీయాలు.. వారితోనే ముగుస్తాయి: భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
- ఆధిపత్యం కోసం హత్యలు చేసిన చరిత్ర వైఎస్ కుటుంబానిదన్న భూమిరెడ్డి
- మైనింగ్ గనుల కోసం ఎంతో మందిని చంపేశారని ఆరోపణ
- వైఎస్సార్ ను మావోయిస్టులు చంపాలని ప్రయత్నించలేదా అని ప్రశ్న
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ హత్యల చుట్టూ తిరుగుతున్న విమర్శల పర్వంలో తెలుగుదేశం పార్టీ మరోసారి వైసీపీ అధినేత జగన్ పై ఎదురుదాడికి దిగింది. కడప జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి వైఎస్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందుల గడ్డపై నాడు వైఎస్ రాజారెడ్డి అరాచకాలు సృష్టించారని, కేవలం అధికారం, ఆధిపత్యం కోసమే హత్యలు, కుట్రలు చేసిన చరిత్ర వైఎస్ కుటుంబానిదని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మైనింగ్ గనులను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం కోసం ఎంతోమంది అమాయకులను చంపేశారని ఆరోపించారు. వైఎస్ కుటుంబంతోనే రాష్ట్రంలో హత్యా రాజకీయాలు మొదలయ్యాయని, వారితోనే అవి ముగుస్తాయని రాంగోపాల్‌రెడ్డి హెచ్చరించారు.
వైఎస్ కుటుంబం నెత్తుటి కూడు తింటోందంటూ రాంగోపాల్‌రెడ్డి ఘాటు పదజాలంతో విమర్శలు గుప్పించారు. "గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను మేనేజ్ చేసి, ఆ అండతోనే ఎన్నో కేసుల నుంచి తప్పించుకున్నారు. ఎదురుతిరిగిన ఎవరినీ వైఎస్ కుటుంబం వదిలిపెట్టలేదు. ఇన్ని అరాచకాలు, హత్యలు చేసి.. ఇప్పుడు తాము స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబమని చెప్పుకుంటారా?" అని ఎద్దేవా చేశారు. నాడు రాజారెడ్డి బ్రిటిష్ సైన్యం కోసం పనిచేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించిన ఆయన, అప్పటి మద్రాస్ బాంబు ఘటన తర్వాత రాజారెడ్డి అక్కడి నుంచి పారిపోయి రాలేదా అని అడిగారు. బ్రిటిష్ వారి కింద పనిచేసి ఇప్పుడు దేశభక్తులమని కలరింగ్ ఇస్తున్నారని మండిపడ్డారు.
గత చరిత్రను ప్రస్తావిస్తూ.. నరసయ్య హత్య విషయంలో నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మావోయిస్టులు చంపాలని చూడలేదా, అలాగే సచివాలయంలో వైఎస్సార్‌పై కాల్పులు జరగలేదా అని రాంగోపాల్‌రెడ్డి గుర్తుచేశారు. బాంబులు లేకుండా వైఎస్ కుటుంబ సభ్యులు ఏనాడైనా బయటకు వచ్చారా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో తమ ఇళ్లను కూల్చి, ఆస్తులను కొల్లగొట్టి, లాకప్‌లలో పెట్టి చిత్రహింసలు పెట్టినప్పుడు జగన్‌కు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా అని నిలదీశారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్, హత్యా రాజకీయాలకు బాట వేసిందే వైఎస్ కుటుంబమని, జగన్ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మనిషిగా మారాలని హితవు పలికారు.