జపాన్‌లో 90 లక్షల 'దెయ్యాల కొంపలు'.. ఎందుకీ వింత పరిస్థితి?

Japan Ghost Houses 9 Million Abandoned Homes
  • జపాన్‌లో రికార్డు స్థాయిలో 90 లక్షల ఇళ్లు ఖాళీగా ఉన్నాయి
  • జనాభా క్షీణత, వృద్ధాప్యమే ఈ సమస్యకు ప్రధాన కారణం
  • వారసత్వ సమస్యలు, పన్నుల విధానాలతో యజమానులకు ఇబ్బందులు
  • కూల్చివేత ఖర్చులు అధికంగా ఉండటంతో నిరుపయోగంగా మారుతున్న భవనాలు
టెక్నాలజీకి మారుపేరైన జపాన్‌లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 90 లక్షల ఇళ్లు మనుషులు లేక వెలవెలబోతున్నాయి. స్థానికంగా వీటిని 'అకియా' అని పిలుస్తుంటారు. చూసేవారికి ఇవి 'దెయ్యాల కొంపలు'గా కనిపిస్తున్నాయి. కిటికీలకు కర్టెన్లు ఉన్నా, లోపల మనిషి లేని ఈ ఇళ్లు దేశానికి కొత్త రకం సమస్యగా మారాయి. 2023 సర్వే ప్రకారం, దేశంలోని మొత్తం ఇళ్లలో సుమారు 13.8 శాతం ఖాళీగా ఉన్నాయి.

కారణం ఇదే..!

ఈ సమస్యకు ప్రధాన కారణం జపాన్‌లో వేగంగా క్షీణిస్తున్న జనాభా. దేశంలో జననాల రేటు తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరగడంతో అనేక గ్రామీణ ప్రాంతాలు ఖాళీ అవుతున్నాయి. యువత ఉద్యోగాల కోసం నగరాలకు తరలివెళ్తుండటంతో పల్లెల్లో ఇళ్లను చూసుకునే వారు కరువయ్యారు. దీనికి తోడు, వారసత్వ సమస్యలు ఈ సంక్షోభాన్ని మరింత జటిలం చేస్తున్నాయి. ఒక ఇంటికి చాలా మంది వారసులు ఉండటం, వారు వేర్వేరు ప్రాంతాల్లో నివసించడం వల్ల ఆస్తిని అమ్మడం లేదా నిర్వహించడం కష్టంగా మారింది.

మరోవైపు, పన్ను విధానాలు కూడా ఈ సమస్యకు పరోక్షంగా కారణమవుతున్నాయి. ఖాళీ స్థలంతో పోలిస్తే, దానిపై ఇల్లు ఉంటే ఆస్తి పన్ను చాలా తక్కువగా ఉంటుంది. దీంతో యజమానులు వాటిని కూల్చివేయడానికి ఇష్టపడటం లేదు. ఒక ఇంటిని కూల్చివేయడానికి దాదాపు 10 నుండి 15 లక్షల యెన్‌ల వరకు ఖర్చవుతుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి విలువ కంటే ఎక్కువ కావడంతో ఎవరూ ఆ సాహసం చేయడం లేదు.

ఫలితంగా, ఈ ఇళ్లు కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకుని, స్థానిక ప్రభుత్వాలకు భద్రతాపరమైన సవాలుగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాలు 'దెయ్యాల ఊళ్లు' (ఘోస్ట్ టౌన్స్)గా మారుతున్నాయి. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రోత్సాహకాలు అందిస్తున్నప్పటికీ, జనాభా సంక్షోభం కారణంగా ఫలితాలు నెమ్మదిగా వస్తున్నాయి.


Go Back to Shorts
Japan ghost houses
Akiya houses
Japan abandoned homes
Japan population decline
Japan aging population
Rural depopulation Japan
Japan property tax
Japanese real estate
Ghost towns Japan

More Telugu News