ఇంధన ధరల పెంపు.. ట్యాక్స్ తగ్గిస్తే రూ.1 లక్ష కోట్ల నష్టం: నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman Responds to Fuel Price Hike Criticizes Fear Mongering
  • పన్నులు తగ్గిస్తే లక్ష కోట్ల నష్టమన్న నిర్మల
  • ‘3-ఎఫ్’ అంశాలపై కేంద్రం ప్రత్యేక నిఘా
  • దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్న మంత్రి
  • భయాందోళనలు సృష్టించొద్దంటూ రాహుల్‌ గాంధీకి పరోక్ష కౌంటర్‌
దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరగడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం స్పందించారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను తగ్గిస్తే ప్రభుత్వం దాదాపు రూ.లక్ష కోట్ల ఆదాయం నష్టపోతుందని వెల్లడించారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉందన్నారు. కొందరు పనిగట్టుకొని ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని, అలాంటి వాటికి తావులేదని స్పష్టం చేశారు.

రాహుల్‌కు పరోక్ష కౌంటర్‌
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ఐడీబీఐ) 37వ వార్షికోత్సవంలో మాట్లాడిన మంత్రి ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉందని స్పష్టం చేశారు. కానీ కొంతమంది అంతా మునిగిపోతోందనేలా భయాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పరోక్షంగా రాహుల్‌ గాంధీని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభం ఎదుర్కోబోతోందని హెచ్చరించిన విషయం తెలిసిందే. 

‘3-ఎఫ్’ ఫార్ములా
పశ్చిమాసియా సంక్షోభం మొదలై మూడు నెలలు కావస్తున్న తరుణంలో ప్రభుత్వం ‘3-ఎఫ్’ (ఫ్యూయల్, ఫెర్టిలైజర్, ఫారెక్స్ - ఇంధనం, ఎరువులు, విదేశీ మారకం)పై ప్రత్యేక దృష్టి సారించిందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అంతర్జాతీయ ఒత్తిళ్ల వల్ల ఎరువుల ధరలు ఊహించని స్థాయికి చేరాయని, బంగారం ధరలు పెరగడం కూడా సవాలుగా మారిందని చెప్పారు. బయటి సంక్షోభాలను తట్టుకునేలా మోదీ నేతృత్వంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు.

భయాందోళనలు వద్దు
ప్రస్తుత సవాళ్లు అన్నీ అంతర్జాతీయ పరిస్థితుల వల్ల వచ్చినవేనని, దేశీయంగా ఆర్థిక పరిస్థితి సానుకూలంగానే ఉందని నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. సామాన్య ప్రజలు సాధిస్తున్న విజయాలను మరిచిపోయి, కేవలం నెగటివిటీని ప్రచారం చేయడం సరికాదన్నారు. మన దేశం ఇలాంటి భయానక ప్రచారాలను భరించలేదని, మన మాటలు, చేతల ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.
Go Back to Shorts
Nirmala Sitharaman
Fuel prices
Excise duty
Indian economy
West Asia crisis
Fertilizer prices
Forex reserves
Rahul Gandhi
SIDBI
Economic challenges

More Telugu News