విజయ్ గెలుపు ఒక 'సినిమా సునామీ'.. ఆ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు: స్టాలిన్

  • తమిళనాడులో అధికార, విపక్ష పార్టీల మధ్య మొదలైన మాటల యుద్ధం
  • విజయ్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగలేదన్న స్టాలిన్
  • టీవీకే పార్టీ మేజిక్ ఫిగర్ మార్కును కూడా దాటలేక పోయిందని ఎద్దేవా

తమిళనాడు రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సరికొత్త యుద్ధం మొదలైంది. డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎం.కె.స్టాలిన్ ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చెన్నైలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం అధికారంలో ఉన్న విజయ్ ప్రభుత్వం ఐదేళ్లపాటు పూర్తి కాలం కొనసాగలేదని, అది డీఎంకే దయాదాక్షిణ్యాలపైనే నడుస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


తమిళనాడు ఎన్నికల ఫలితాలను ఒక రాజకీయ ప్రభంజనంగా తాను భావించడం లేదని, ఇదొక ‘సినిమా సునామీ’ మాత్రమేనని స్టాలిన్ అభివర్ణించారు. ఓటర్లు ఎలాంటి రాజకీయ విశ్వాసం లేదా సిద్ధాంతాలను చూసి టీవీకే పార్టీకి ఓటు వేయలేదని, కేవలం ఒక ప్రముఖ స్టార్ నటుడు పార్టీ పెట్టాడనే ఉత్సాహంతోనే విజయ్‌కు మద్దతు తెలిపారని అన్నారు. పిల్లలకు కొత్తగా ఆడుకునేందుకు ఒక ఆటవస్తువు దొరికితే ఎంత ఉత్సాహం చూపిస్తారో, ఇదీ అలాంటిదేనని... కొన్ని రోజుల్లోనే ఆ ఆటవస్తువుపై ప్రజలకు ఆసక్తి తగ్గిపోతుందని వ్యాఖ్యానించారు. ఒక బిడ్డ తన తల్లి కోసం వెతికినట్టు, తమిళనాడు ఓటర్లు త్వరలోనే మళ్లీ డీఎంకే కోసం వెతకడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా మేజిక్ ఫిగర్ అంశాన్ని స్టాలిన్ ప్రధానంగా ప్రస్తావించారు. టీవీకే పార్టీ సొంతంగా మేజిక్ ఫిగర్ అయిన 118 సీట్ల మార్కును దాటడంలో పూర్తిగా విఫలమైందని గుర్తుచేశారు. కనీస మెజారిటీ కూడా సాధించలేకపోయిన ఆ ప్రభుత్వం, ఈ రోజు డీఎంకే కూటమిలోని పార్టీల మద్దతు వల్లే మనుగడ సాగిస్తోందని, ఏ క్షణమైనా ఈ ప్రభుత్వం కూలిపోవచ్చని హెచ్చరించారు. డీఎంకేను చీల్చేందుకు తెరవెనుక తీవ్ర ప్రయత్నాలు జరిగాయని, కానీ అవి విఫలమయ్యాయని చెప్పారు. కమ్యూనిస్ట్ పార్టీలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు మొదట టీవీకే ప్రభుత్వానికి బయటి నుంచి మాత్రమే మద్దతు ఇస్తామని చెప్పి, ఆ తర్వాత క్యాబినెట్‌లో చేరడాన్ని ఆయన తప్పుపట్టారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి అత్యంత అస్థిరంగా ఉందని వ్యాఖ్యానించారు.


Vijay
Tamil Nadu politics
MK Stalin
TVK party
Tamil Nadu elections
DMK
political instability
election results
Tamil cinema
political tsunami

More Telugu News