‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ ఇన్‌స్టా అకౌంట్‌ హ్యాక్‌.. వ్యవస్థాపకుడి ఆరోపణ

  • తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా హ్యాక్ అయిందని అభిజిత్ వెల్లడి
  • పార్టీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీనీ హ్యాక్ చేసినట్లు ఆరోపణ
  • ఆయా అకౌంట్లపై నియంత్రణ కోల్పోయినట్లు ప్రకటన
  • మెటా రికవరీ ప్రయత్నాలు విఫలమయ్యాయని వివరణ
  • రాబోయే పోస్టులను పార్టీ అధికారిక ప్రకటనలుగా భావించవద్దని విజ్ఞప్తి
యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ (సీజేపీ) సోషల్ మీడియా ఖాతాలపై మళ్లీ డిజిటల్ దాడులు మొదలయ్యాయని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఆరోపించారు. తన వ్యక్తిగత ఇన్‌స్టాతో పాటు పార్టీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీ కూడా హ్యాక్‌కు గురైందని తెలిపారు. దీంతో రెండు ఖాతాలపై నియంత్రణ కోల్పోయానని చెప్పారు.

లాక్ అయ్యాయన్న అభిజీత్
అకౌంట్లను పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అభిజిత్ వివరించారు. మెటా రికవరీ ప్రక్రియను ఉపయోగించిన ప్రతిసారీ భద్రతా కారణాల వల్ల ఖాతాలను లాక్ చేసినట్లు మెసేజ్ వస్తోందని స్క్రీన్‌షాట్లు పంచుకున్నారు. గుర్తింపును నిరూపించి కొత్త పాస్‌వర్డ్ పెట్టుకోవాలని సూచిస్తోందని, ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇదే సమాధానం వస్తోందని పేర్కొన్నారు.

అణచివేతపై ఆగ్రహం
ఈ పరిణామాలపై అభిజిత్ దిప్కే ‘ఎక్స్’ వేదికగా తీవ్రంగా స్పందించారు. ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ లక్ష్యంగా అణచివేత సాగుతోందని ఆరోపించారు. తన వ్యక్తిగత ఖాతా, పార్టీ పేజీ హ్యాక్ అవ్వడంతో పాటు పార్టీ బ్యాకప్ ఇన్‌స్టాగ్రామ్ పేజీని కూడా కాసేపు తొలగించారని మండిపడ్డారు. ప్రస్తుతం తమ ప్లాట్‌ఫామ్‌లు వేటికీ తమకు యాక్సెస్ లేదని స్పష్టం చేశారు.

తాజా పోస్టులపై స్పష్టత
ఖాతాలు చేతులు మారడంతో అభిజిత్ తన మద్దతుదారులను అప్రమత్తం చేశారు. ఇప్పటి నుంచి వచ్చే ఏ పోస్టునూ సీజేపీ అధికారిక ప్రకటనగా భావించొద్దని కోరారు. గతంలోనే ఈ పార్టీ ప్రధాన ‘ఎక్స్’ అకౌంట్‌ను భారత్‌లో నిలిపివేశారని గుర్తు చేశారు. ఆ వెంటనే తాము ‘కాక్రోచ్‌ ఈజ్ బ్యాక్’ పేరుతో కొత్త ఖాతాను తెరిచి విమర్శకులకు కౌంటరిచ్చినట్లు పేర్కొన్నారు.

More Telugu News