పేరెంట్స్‌ ఐఏఎస్‌లు అయ్యాక పిల్లలకు రిజర్వేషన్‌ ఎందుకు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

  • ఐఏఎస్ అధికారుల పిల్లలకు రిజర్వేషన్లపై ప్రశ్నలు
  • విద్యా, ఆర్థిక ఎదుగుదలతో సామాజిక మార్పు
  • రిజర్వేషన్ల నుంచి తరం మారాలని సూచన
  • క్రీమీ లేయర్ మినహాయింపులపై కోర్టు విచారణ
  • ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారికి కోటాపై అసంతృప్తి
రిజర్వేషన్ల ప్రయోజనాలు పొంది విద్యాపరంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలకు ఇంకా కోటా ఎందుకని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన తరగతుల్లోని ‘క్రీమీ లేయర్’ మినహాయింపులపై దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజంలో ఒకసారి ఆర్థిక, సామాజిక ఎదుగుదల వచ్చాక కూడా మళ్లీ రిజర్వేషన్లు కోరడాన్ని కోర్టు తప్పుబట్టింది.

‘‘తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులు అయితే, వారి పిల్లలకు ఇంకా రిజర్వేషన్లు ఎందుకు? విద్యాపరమైన, ఆర్థికపరమైన సాధికారత వచ్చినప్పుడు సమాజంలో హోదా దానంతట అదే మారుతుంది. ఒకసారి విద్యా, ఆర్థిక ఎదుగుదల ద్వారా సామాజిక మార్పు వచ్చాక.. మళ్లీ వారి పిల్లలు కూడా రిజర్వేషన్లు కోరితే ఈ వ్యవస్థ నుంచి మనం ఎప్పటికీ బయటపడలేం. ఉన్నత స్థాయికి చేరిన వారిని కోటా ప్రయోజనాల నుంచి మినహాయిస్తూ ఇప్పటికే పలు ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
 
‘‘విద్యార్థుల తల్లిదండ్రులు మంచి ఉద్యోగాల్లో ఉంటూ, మంచి ఆదాయం సంపాదిస్తున్నా.. వారి పిల్లలు మళ్లీ రిజర్వేషన్లు కావాలంటున్నారు. నిజానికి వారు రిజర్వేషన్ల పరిధి నుంచి బయటకు రావాలి. రిజర్వేషన్ల వల్ల ఒక తరం ఉన్నత స్థాయికి చేరుకున్నాక తదుపరి తరం అర్హతలపై కచ్చితంగా సమీక్ష జరగాలి. అప్పుడే సమాజంలో సమతుల్యత ఉంటుంది’’ అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. 

ఈడబ్ల్యూఎస్ కోటాపై వివరణ
ఇదే సమయంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లపై కూడా కోర్టు మాట్లాడింది. ‘‘ఈడబ్ల్యూఎస్ కోటా అనేది కేవలం ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చేది. అందులో సామాజిక వెనుకబాటుతనం అనే కోణం ఉండదు’’ అని జస్టిస్ నాగరత్న వివరించారు. ఈ మొత్తం వ్యవహారంపై స్పందించాల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టు సంబంధిత పక్షాలన్నింటికీ నోటీసులు జారీ చేసింది.

Supreme Court
Reservation
Creamy Layer
IAS Officers
EWS Quota
Economic Backwardness
Social Justice
Supreme Court Remarks
Reservation Policy
Nagaratna

More Telugu News