నా కెరీర్ ముగించడానికి అతడు అన్ని ప్రయత్నాలు చేశాడు: గుత్తా జ్వాల

Gutta Jwala alleges conspiracy to end her career
  • మాజీ బీఏఐ చీఫ్ వీకే వర్మపై జ్వాలా గుత్తా సంచలన ఆరోపణలు
  • కామన్వెల్త్ గోల్డ్ గెలిచినా తనను అభినందించలేదని ఆవేదన
  • సరైన మద్దతు లభించి ఉంటే వరల్డ్ నెం.1 అయ్యేదాన్నని వెల్లడి
  • రెండుసార్లు జట్టు నుంచి అకారణంగా తొలగించారని ఆరోపణ
  • నీరజ్ చోప్రాకు లభించినట్టు ప్రోత్సాహం ఉండాలన్న జ్వాలా
భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా తన కెరీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. సరైన మద్దతు లభించి, వివాదాలకు దూరంగా ఉండుంటే తాను ప్రపంచ నంబర్ వన్ అయ్యేదాన్నని ఆమె అభిప్రాయపడింది. అప్పటి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) అధ్యక్షుడు వీకే వర్మ, ఇతర కోచ్‌లు తన కెరీర్‌ను దెబ్బతీయాలని చూశారని ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.

2010 కామన్వెల్త్ గేమ్స్‌లో జరిగిన ఓ ఘటనను ఆమె గుర్తుచేసుకుంది. ఆ టోర్నీలో తాను, అశ్విని పొన్నప్ప డబుల్స్ స్వర్ణం గెలిచిన తర్వాత సైనా నెహ్వాల్ సింగిల్స్‌లో స్వర్ణం సాధించిందని తెలిపింది. "మేం స్వర్ణం గెలిచినప్పుడు వీకే వర్మ పట్టించుకోలేదు. కానీ, రెండు గంటల తర్వాత సైనా గెలవగానే అతడు కోర్టులోకి పరుగెత్తుకెళ్లి సంబరాలు చేసుకున్నాడు. మా స్వర్ణం తక్కువేమీ కాదు కదా? అని ఆనాడే ప్రశ్నించాను" అని జ్వాలా వివరించింది.

వీకే వర్మ తన కెరీర్‌ను ముగించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడని జ్వాలా ఆరోపించింది. "2006లో ఎలాంటి కారణం చెప్పకుండా నన్ను జట్టు నుంచి తొలగించారు. మళ్లీ రియో ఒలింపిక్స్ తర్వాత కూడా అదే పునరావృతమైంది. ఆ తర్వాత పోరాడి ప్రయోజనం ఏముందనిపించింది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఏ క్రీడాకారుడూ వివాదాలు కోరుకోడని, కానీ తన హక్కుల కోసం పోరాడాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది.

ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా దీనికి సరైన ఉదాహరణ అని, ఒక ప్రపంచ ఛాంపియన్‌ను తయారు చేయడానికి ఎంత వ్యక్తిగత శ్రద్ధ, పెట్టుబడి అవసరమో అతన్ని చూస్తే తెలుస్తుందని జ్వాల వెల్లడించింది. "ఎలాంటి ఆర్థిక మద్దతు, స్పాన్సర్‌షిప్ లేకుండానే నేను వరల్డ్ నంబర్ 5కి చేరుకున్నాను. అదే మద్దతు ఉండి ఉంటే నంబర్ వన్ అయ్యేదాన్ని" అని జ్వాలా తెలిపింది. క్రీడా వ్యవస్థలో మార్పు రావాలని, నేటి క్రీడారంగంలో రాజకీయ పలుకుబడి ఉన్నవారి మాటే నెగ్గుతోందని ఆమె వ్యాఖ్యానించింది.


Go Back to Shorts
Gutta Jwala
Jwala Gutta
badminton
VK Verma
BAI
Ashwini Ponnappa
Saina Nehwal
Commonwealth Games
badminton association of india
sports

More Telugu News