కోపంలో హద్దుమీరిన హార్దిక్ పాండ్యాకు భారీ జరిమానా!

  • ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన హార్దిక్ పాండ్యా
  • మ్యాచ్ ఫీజులో 10 శాతం కోతతో పాటు అత‌ని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ 
  • కేకేఆర్‌తో మ్యాచ్‌లో వికెట్ల బెయిల్స్‌ను గట్టిగా కొట్టిన వైనం
  • తన తప్పును అంగీకరించి, మ్యాచ్ రిఫరీ శిక్షను అంగీక‌రించిన‌ హార్దిక్
ముంబై ఇండియన్స్ (ఎంఐ) కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఐపీఎల్ యాజమాన్యం జరిమానా విధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌ (కేకేఆర్‌)తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను ఖాతాలో జతచేసింది.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బౌలింగ్ రనప్ కోసం వెళ్తూ హార్దిక్ పాండ్యా కోపంగా వికెట్ల బెయిల్స్‌ను చేత్తో గట్టిగా కొట్టి పడగొట్టాడు. ఇది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.2 ప్రకారం 'క్రికెట్ పరికరాలను దుర్వినియోగం చేయడం' కిందకు వస్తుందని ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. మ్యాచ్ రిఫరీ రాజీవ్ సేథ్ విధించిన ఈ శిక్షను హార్దిక్ అంగీకరించాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబైని కేకేఆర్ బౌలర్లు 147/8 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. మనీశ్ పాండే, రోవ్‌మన్ పావెల్ కీలక భాగస్వామ్యంతో తమ జట్టుకు విజయాన్ని అందించారు. ఈ విజయంతో కేకేఆర్ తమ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

మ్యాచ్ అనంతరం హార్దిక్ మాట్లాడుతూ.. "పవర్‌ప్లేలో ఎక్కువ వికెట్లు కోల్పోవడం మా ఓటమికి కారణమైంది. ఇలాంటి బౌలర్లకు అనుకూలించే పిచ్‌లపై ఆడటాన్ని నేను ఆస్వాదిస్తాను. ఐపీఎల్‌లో బ్యాటర్ల ఆధిపత్యం పెరిగిపోతున్న తరుణంలో ఇలాంటి వికెట్లు బౌలర్లకు కూడా అవకాశం కల్పిస్తాయి" అని వ్యాఖ్యానించాడు.

Hardik Pandya
Mumbai Indians
IPL 2024
Kolkata Knight Riders
Eden Gardens
Match Fee Deduction
Code of Conduct
Cricket Equipment Abuse
KKR vs MI
Rohman Powell

More Telugu News