చెప్పిందే చేసి చూపించిన కమల్.. ‘కల్కి 2’ కోసం ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం!

  • చిత్ర పరిశ్రమలో పొదుపు పాటించాలని చెప్పిందే చేసి చూపించిన కమల్ హాసన్
  • 'కల్కి 2' షూటింగ్ కోసం చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం
  • కమల్ నిర్ణయంపై వైజయంతీ మూవీస్ ప్రశంసల జల్లు
  • పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఖర్చులు తగ్గించాలని ఇటీవల కమల్ పిలుపు
పశ్చిమాసియాలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ సినీ పరిశ్రమపై పడుతోందని, ఈ సమయంలో ప్రొడక్షన్ ఖర్చులు తగ్గించుకోవాలని కొన్ని రోజుల క్రితం పిలుపునిచ్చిన లోకనాయకుడు కమల్ హాసన్, ఆ మాటలను స్వయంగా ఆచరించి చూపించారు. తను చెప్పిన పొదుపు సూత్రాలకు కట్టుబడి, ‘కల్కి 2’ తాజా షెడ్యూల్ కోసం చెన్నై నుంచి హైదరాబాద్‌కు సాధారణ ప్రయాణికుడిలా ఎకానమీ క్లాస్ విమానంలో ప్రయాణించారు. విలాసవంతమైన చార్టర్ విమానాలు, బిజినెస్ క్లాస్ సౌకర్యాలను పక్కనపెట్టి ఆయన నేరుగా షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

కమల్ హాసన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ‘కల్కి’ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ మనస్ఫూర్తిగా ప్రశంసించింది. విమానంలో కమల్ ప్రయాణిస్తున్న ఫొటోను 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా షేర్ చేస్తూ.. "పరిశ్రమ కష్టకాలంలో ఉన్నప్పుడు, చార్టర్ విమానాలు, విలాసవంతమైన ప్రయాణాలను వదులుకుని ఎకానమీ క్లాస్‌లో నేరుగా సెట్స్‌కు వెళ్లాలని నిర్ణయించుకోవడం కమల్ హాసన్ లాంటి లెజెండ్‌కే సాధ్యం. సినీ రంగంలో గొప్ప మార్పులకు ఇది మొదటి అడుగు" అని పేర్కొంది.

కొన్ని రోజుల క్రితం కమల్ హాసన్ విడుదల చేసిన బహిరంగ లేఖలో, సినిమా నిర్మాణంలో ప్రతి పైసా కూడా అవుట్‌పుట్ కోసమే ఖర్చు కావాలని, అనవసర విలాసాలకు స్వస్తి పలకాలని సూచించారు. అదే సమయంలో దినసరి కార్మికుల వేతనాలు, భద్రత, భోజన వసతుల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ మాటలకు కట్టుబడి ఆయన ఆచరణలో చూపించడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా ‘కల్కి పార్ట్ 2’ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. మొదటి భాగం క్లైమాక్స్‌లో కొద్దిసేపు కనిపించిన కమల్ హాసన్, ఈ సీక్వెల్‌లో ‘సుప్రీం యాస్కిన్’ అనే పూర్తిస్థాయి ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే కమల్, అమితాబ్ బచ్చన్‌లపై కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పుడు ప్రారంభమైన కొత్త షెడ్యూల్‌లో పాల్గొనడానికే కమల్ హైదరాబాద్ వచ్చారు. ఆయన నిరాడంబరత ఇండస్ట్రీ వర్గాలనే కాక, సోషల్ మీడియాలోనూ అందరి మనసులు గెలుచుకుంటోంది.

Kamal Haasan
Kalki 2898 AD
Kalki 2
Prabhas
Nag Ashwin
Vyjayanthi Movies
economy class travel
movie production cost
Supreme Yaskin
Indian cinema

More Telugu News