ధోనీ వారసుడిగా విఫలమైన రుతురాజ్.. సీఎస్కే కెప్టెన్సీ మార్పు?

  • ఐపీఎల్ 2026లో మరోసారి ఘోరంగా విఫలమైన చెన్నై
  • కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్, నాయకత్వంపై విమర్శలు
  • సీఎస్కేకు సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా నియమించాలన్న‌ మనోజ్ తివారీ
  • వచ్చే సీజన్‌లో చెన్నై జట్టులో కెప్టెన్సీ మార్పు ఖాయమంటున్న విశ్లేషకులు
ఐపీఎల్‌లో ఈసారి కూడా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచింది. దాంతో మరో నిరాశాజనక సీజన్ తర్వాత  జట్టులో నాయకత్వ మార్పుపై చర్చ మొదలైంది. ఐపీఎల్ 2026లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైన సీఎస్కే, వచ్చే సీజన్ కోసం జట్టును పునర్నిర్మించే పనిలో పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్, కెప్టెన్సీ రెండింటిలోనూ విఫలమవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ.. చెన్నైకి తదుపరి కెప్టెన్‌గా సంజూ శాంసన్ సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డాడు.

నిన్న‌ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ అనంతరం ఒక క్రీడా వెబ్‌సైట్ చర్చా కార్యక్రమంలో తివారీ మాట్లాడుతూ.. "కెప్టెన్‌గా రాణించాలంటే ముందుగా బ్యాటర్‌గా పరుగులు చేయాలి. కానీ, రుతురాజ్ బ్యాటింగ్ ఫామ్ ఏమాత్రం బాగాలేదు. అతని ఆటలో మునుపటి జోరు కొరవడింది. ఇది అతని కెప్టెన్సీపై స్పష్టంగా ప్రభావం చూపుతోంది" అని అన్నాడు. ఈ సీజన్‌లో రుతురాజ్ 13 మ్యాచ్‌ల్లో 29.18 సగటు, 120.68 స్ట్రైక్ రేట్‌తో కేవలం 321 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి.

ఎంఎస్ ధోనీ వారసుడిగా రుతురాజ్‌పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, వాటిని అందుకోవడంలో అతను విఫలమయ్యాడని తివారీ పేర్కొన్నాడు. " ధోనీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. రుతురాజ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంపై దృష్టి పెట్టాలి. కెప్టెన్‌గా తన తప్పులను విశ్లేషించుకుని వచ్చే సీజన్‌కు సిద్ధం కావాలి" అని ఆయన సూచించాడు.

ఈ పరిస్థితుల్లో రాజస్థాన్ రాయల్స్‌కు విజయవంతంగా నాయకత్వం వహించిన అనుభవం ఉన్న సంజూ శాంసన్, సీఎస్కేకు సరైన ఎంపిక అవుతాడని తివారీ అభిప్రాయపడ్డాడు. "రుతురాజ్‌కు రెండు సీజన్లుగా అవకాశం ఇచ్చారు. అయినా ఫలితం రాలేదు. నా అంచనా ప్రకారం వచ్చే ఏడాది కెప్టెన్సీ రేసులో సంజూ శాంసన్ పేరు బలంగా వినిపిస్తోంది. నాయకుడిగా, మంచి బ్యాటర్‌గా సంజూకు మంచి రికార్డు ఉంది. సీఎస్కే అతడిని సార‌థిగా నియ‌మిస్తే అది మంచి నిర్ణయమే అవుతుంది" అని తివారీ పేర్కొన్నాడు. దీంతో వచ్చే సీజన్‌లో సీఎస్కే సారథి ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది.

Ruturaj Gaikwad
CSK
Chennai Super Kings
IPL 2026
Sanju Samson
Manoj Tiwary
MS Dhoni
IPL
Cricket
Captaincy

More Telugu News