అదానీకి భారీ ఊరట.. అమెరికాలో కేసులన్నీ క్లోజ్
- గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై కేసులు రద్దు
- మళ్లీ కేసే వేయడానికి వీల్లేకుండా కొట్టివేత
- ఆధారాలు, యూఎస్‌కు సంబంధాలు లేవని వెల్లడి
- సివిల్ కేసుల కోసం 18 మిలియన్ డాలర్లు చెల్లించిన అదానీలు
- ఇరాన్ ఆంక్షల వివాదం క్లోజ్ కోసం అమెరికా ట్రెజరీకి 275 మిలియన్ డాలర్లు
ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ గౌతమ్ అదానీ, ఆయన సోదరి కుమారుడు సాగర్ అదానీలకు అమెరికా న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. న్యూయార్క్‌లో వారిపై నమోదైన హై-ప్రొఫైల్ సెక్యూరిటీస్, వైర్ ఫ్రాడ్ క్రిమినల్ కేసులను అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ శాశ్వతంగా ఉపసంహరించుకుంది. అదానీలపై మోపిన ఆరోపణలను నిరూపించడానికి తగిన ఆధారాలు లేవని, ఈ కేసులో అమెరికాకు ఎటువంటి ప్రత్యక్ష సంబంధాలు కనపడలేదని ప్రాసిక్యూటర్లు తేల్చిచెప్పారు. దీంతో అదానీ గ్రూప్‌పై అమెరికాలో సాగుతున్న అన్ని రకాల చట్టపరమైన విచారణలకు పూర్తిగా తెరపడింది.
ఈ కేసును ‘విత్ ప్రిజుడీస్’ కింద కోర్టు కొట్టివేసింది. అంటే ఈ కేసును భవిష్యత్తులో మళ్లీ రీ-ఓపెన్ చేయడానికి వీలుండదు. అమెరికా క్రిమినల్ నిబంధనల్లో ఇలాంటి ఉపసంహరణలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఈ కేసులో మరింత సమయాన్ని, వనరులను వృథా చేయదలచుకోలేదని న్యాయస్థానానికి సమర్పించిన పత్రాల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పేర్కొంది. 2024 చివరలో నమోదైన ఈ కేసు.. అదానీ గ్రూప్ అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికలకు పెద్ద అడ్డంకిగా మారిన తరుణంలో ఈ తీర్పు రావడం గ్రూప్‌నకు కలిసొచ్చే అంశం. భారతదేశంలో సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం అదానీ రూ.2,000 కోట్లకు పైగా లంచాలు ఇచ్చారని, ఆ విషయాన్ని అమెరికా ఇన్వెస్టర్ల వద్ద దాచారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసు పూర్తిగా క్లోజ్ కావడానికి ముందు అదానీ గ్రూప్ అమెరికా ప్రభుత్వ విభాగాలతో కొన్ని సివిల్ సెటిల్మెంట్లు చేసుకుంది. సోలార్ ప్రాజెక్టుల డిస్క్లోజర్ల వివాదంలో గౌతమ్ అదానీ 6 మిలియన్ డాలర్లు, సాగర్ అదానీ 12 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించడానికి యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌తో ఒప్పందం కుదుర్చుకొన్నారు. అలాగే ఇరాన్ నుంచి ఎల్పీజీ దిగుమతుల ద్వారా అమెరికా ఆంక్షలను ఉల్లంఘించారనే ఆరోపణలపై అదానీ ఎంటర్ప్రైజెస్.. యూఎస్ ట్రెజరీ విభాగానికి 275 మిలియన్ డాలర్లు చెల్లించి ఆ వివాదాన్ని కూడా పరిష్కరించుకుంది. ఈ సెటిల్మెంట్లు అన్నింటిలోనూ అదానీ గ్రూప్ తమ తప్పును అంగీకరించకుండానే వివాదాలను ముగించడం గమనార్హం.
అదానీ తరఫున రంగంలోకి దిగిన సలివన్ & క్రామ్వెల్ వంటి ఐదు టాప్ అమెరికన్ న్యాయ సంస్థలు ఈ కేసు అమెరికా పరిధిలోకి రాదని గట్టిగా వాదించాయి. నిందితులు భారతీయులు, ప్రాజెక్టులు భారతదేశంలోనే జరిగాయి.. అలాగే బాండ్ల వల్ల ఇన్వెస్టర్లకు ఎలాంటి నష్టాలు రాలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లంచం ఆరోపణలను మోపడానికి తగిన ఆధారాలు లేకపోవడంతోనే ప్రాసిక్యూటర్లు దీనిని సెక్యూరిటీస్ ఫ్రాడ్‌గా మార్చారని అదానీ లాయర్లు వాదించారు. చివరికి ఈ వాదనలతో ఏకీభవించిన అమెరికా న్యాయశాఖ.. కేసును పూర్తిగా కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.