నేను ఎమ్మెల్యే కావాలనే ఆశ నాకంటే మీకే ఎక్కువగా ఉన్నట్టుంది: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
- ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో తాను రూ. 600 కోట్ల అవినీతికి పాల్పడ్డానని ఆరోపించారన్న బైరెడ్డి
- ఒక్క ఆరోపణనైనా నిరూపించారా అని ప్రశ్న
- తనకు ఒక్క రూపాయి ఆస్తి కూడా లేదని వ్యాఖ్య
తనపై విమర్శలు చేసే వారికి మంత్రి టీజీ భరత్ ప్రత్యేకంగా బహుమతులు ఇస్తున్నారంటూ వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ఎన్నికల్లో టికెట్ రాలేదంటూ మంత్రి చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. "నేను ఎమ్మెల్యే కావాలనే ఆశ నాకంటే మీకే ఎక్కువగా ఉన్నట్టుంది" అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న సతీష్ అనే వ్యక్తి కుటుంబానికి ఏ ఫార్మా కంపెనీ నుంచి డబ్బులు అందాయో ఆధారాలతో సహా చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే తాను ఆ విషయం బయటపెట్టిన వెంటనే సదరు కంపెనీతో అలా జరగలేదని చెప్పించే కుట్రలు కూడా జరుగుతాయని అన్నారు.
గత ఎన్నికల సమయంలో తనపై జరిగిన దుష్ప్రచారాన్ని, అవినీతి ఆరోపణలను ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన “ఆడుదాం ఆంధ్రా” కార్యక్రమంలో తాను ఏకంగా రూ. 600 కోట్లు అవినీతికి పాల్పడ్డానని కూటమి నేతలు అప్పట్లో ఆరోపించారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చి విచారణ జరిపించిన తర్వాత, విజిలెన్స్ నివేదికలో కేవలం రూ. 40 కోట్ల అక్రమాలే ఉన్నాయని తేలిందని, మరి మిగిలిన మొత్తానికి సమాధానం ఏంటని ప్రశ్నించారు.
ఇంత కాలం గడిచినా తనపై చేసిన ఒక్క ఆరోపణనైనా నిరూపించగలిగారా అని ప్రశ్నించారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో బీజేపీ నేత టీజీ వెంకటేష్పై కూడా స్పందిస్తూ.. ఆయన తన గౌరవాన్ని కోల్పోయి అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒకప్పుడు మీసాలు తిప్పుకుంటూ తిరిగిన కొందరు నేతలు, ఇప్పుడు మీసాలు దించుకుని మీ దగ్గరకు ఎందుకు వచ్చారో సమాధానం చెప్పాలంటూ పరోక్షంగా చురకలు అంటించారు.
కుటుంబ మరియు అంతర్గత రాజకీయాలపై మాట్లాడుతూ, బైరెడ్డి శబరిని కూడా ఆయన గట్టిగా టార్గెట్ చేశారు. గతంలో శబరి తండ్రిని గౌరు వెంకటరెడ్డి 'వేస్ట్ ఫెలో' అని అన్నప్పుడు, అలాగే రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏం సాధించాడంటూ మాండ్ర శివానందరెడ్డి విమర్శించినప్పుడు శబరి ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎంబీబీఎస్, పీజీ సీట్లు కొనిపించిన సొంత తండ్రిపై అంతటి విమర్శలు వస్తున్నా ఆమె స్పందించకపోవడం ఏంటని నిలదీశారు.
చివరగా తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇస్తూ.. "నాకు రూపాయి ఆస్తి లేదు, కష్టమొచ్చినా నష్టమొచ్చినా నేను ప్రజల కోసమే నిలబడతాను.. నాకున్న ఏకైక బలం జగన్ మాత్రమే" అని స్పష్టం చేశారు.