ప్రభుత్వ బ్యాంకులు, బీమా సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు!

Central Government Orders Cost Cutting for Banks Insurance Firms
  • ఖర్చులు తగ్గించుకోవాలని సూచన
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే మీటింగ్‌లు
  • విదేశీ ప్రయాణాలపైనా ఆంక్షలు
  • ఎలక్ట్రిక్ కార్లు వాడాలని సూచన
  • పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పొదుపు చర్యలు
ఖర్చులను భారీగా తగ్గించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ బీమా సంస్థలు, ఆర్థిక సంస్థలకు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు చర్యల్లో భాగంగా ప్రయాణాలపై తీవ్ర ఆంక్షలు విధించడంతో పాటు దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) వంటి దిగ్గజ సంస్థలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులకు వర్తించనున్నాయి.

కేంద్ర ఆర్థిక సేవల విభాగం జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం.. అత్యవసరమైతే తప్ప అన్ని రకాల సమావేశాలు, సమీక్షలు, సంప్రదింపులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే నిర్వహించాలి. సంస్థల చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల (సీఈఓ) విదేశీ ప్రయాణాల్లో పరిమితి పాటించాలని తెలిపింది. సాధ్యమైనంత వరకు విదేశీ సమావేశాలకు వర్చువల్‌గానే హాజరుకావాలని పేర్కొంది. వీటితో పాటు, ప్రధాన కార్యాలయాలు, బ్రాంచ్ ఆఫీసుల్లో ప్రస్తుతం అద్దెకు వాడుతున్న పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో వీలైనంత వరకు ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని ఆదేశించింది.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల ఏర్పడే ఆర్థిక ప్రభావాలను తట్టుకునేందుకు.. ఖర్చులను తగ్గించుకోవాలని, పొదుపు పాటించాలని ప్రధానమంత్రి మోదీ గతవారం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో సుదీర్ఘకాలంగా సాగుతున్న ఉద్రిక్తతల వల్ల దేశ ఆర్థిక వృద్ధి మందగించడం, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే భారత కరెన్సీ రికార్డు స్థాయి కనిష్ఠానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఇప్పటికే పలు రాష్ట్రాలు తమ ఉద్యోగులకు వారానికి రెండు రోజులు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సౌకర్యాన్ని కూడా కల్పించాయి.
Go Back to Shorts
State Bank of India
SBI
Bank of Baroda
Life Insurance Corporation of India
LIC
government banks
financial institutions
electric vehicles
cost reduction
financial discipline

More Telugu News