సీఎస్‌కే ఓటమితో పూర్తిగా మారిన ప్లేఆఫ్స్ సమీకరణాలు.. ఏ జట్టుకు ఎంత శాతం అవకాశం?

  • లక్నో చేతిలో ఓటమితో సీఎస్‌కేకు భారీ ఎదురుదెబ్బ
  • ఆరో స్థానానికి పడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్
  • 28 శాతానికి తగ్గిన సీఎస్‌కే  ప్లేఆఫ్స్ అవకాశాలు
  • గుజరాత్, బెంగళూరు జట్లకు ప్లేఆఫ్స్ బెర్తులు దాదాపు ఖాయం
  • ఇకపై ప్రతీ మ్యాచ్ గెలవడమే మార్గమని చెప్పిన కెప్టెన్ గైక్వాడ్
ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. నిన్న‌ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే ) 7 వికెట్ల తేడాతో ఓటమి పాలుకావడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ ఓటమితో ఐదుసార్లు ఛాంపియన్ అయిన సీఎస్‌కే పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై, కార్తీక్ శర్మ అర్ధశతకంతో రాణించడంతో 20 ఓవర్లలో 187/5 పరుగులు చేసింది. ఎల్ఎస్‌జీ బౌలర్ ఆకాశ్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. అయితే, లక్ష్య ఛేదనలో మిచెల్ మార్ష్ కేవలం 38 బంతుల్లో 90 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో లక్నో సునాయాసంగా విజయం సాధించింది.

ఈ ఫలితం అనంతరం ప్లేఆఫ్స్ అవకాశాలపై ప్రముఖ క్రీడా ప్రసార సంస్థ స్టార్ స్పోర్ట్స్ ఒక విశ్లేషణ విడుదల చేసింది. దీని ప్రకారం 16 పాయింట్లతో ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు ప్లేఆఫ్స్ చేరేందుకు అత్యధికంగా 98 శాతం అవకాశం ఉండగా, అంతే పాయింట్లతో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 96.1 శాతం అవకాశం ఉంది. ఈ రెండు జట్లకూ గ్రూప్ దశలో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. మూడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచ్‌లలో 14 పాయింట్లతో 70.3 శాతం అవకాశాలతో కొనసాగుతోంది.

పంజాబ్ కింగ్స్ (13 పాయింట్లు) కంటే రాజస్థాన్ రాయల్స్ (12 పాయింట్లు)కు ఒక పాయింట్ తక్కువగా ఉన్నప్పటికీ, మెరుగైన అవకాశాలతో (51.6 శాతం) నాలుగో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్‌కు 48.8 శాతం అవకాశం మాత్రమే ఉంది. తాజా ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ ఆశలకు గట్టి దెబ్బ తగిలింది. వారి అవకాశాలు కేవలం 28.4 శాతానికి పడిపోయాయి. ఇక, కోల్‌కతా నైట్ రైడర్స్ (3.6శాతం), ఢిల్లీ క్యాపిటల్స్ (3.1శాతం) అవకాశాలు నామమాత్రంగానే ఉన్నాయి.

ఓటమి అనంతరం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. "మా ముందున్న లెక్క చాలా సులభం. ఇకపై ఆడబోయే ప్రతి మ్యాచ్ గెలవాలి. ఇందులో ఎలాంటి సంక్లిష్టత లేదు. మా తప్పులను సరిదిద్దుకుని, పరిస్థితులకు త్వరగా అలవాటుపడి పుంజుకుంటాం" అని ధీమా వ్యక్తం చేశాడు.

IPL 2026
Chennai Super Kings
CSK
Ruturaj Gaikwad
Lucknow Super Giants
LSG
Playoffs
Points Table
Cricket
Indian Premier League

More Telugu News