జట్టుకు హీరోలు అవసరం.. సూపర్ స్టార్ కల్చర్‌పై గంభీర్‌తో విభేదించిన రాహుల్ ద్రవిడ్

Rahul Dravid Disagrees with Gambhir on Superstar Culture
  • ఆటకు హీరోలు అవసరమని, వారి వల్లే స్ఫూర్తి కలుగుతుందని వ్యాఖ్య
  • టెస్టుల్లో జట్టు ఇబ్బందులకు కోహ్లీ, రోహిత్, అశ్విన్ రిటైర్మెంట్లే కారణమ‌ని వెల్ల‌డి
  • అధిక క్రికెట్ కారణంగా టెస్టులకు సిద్ధమయ్యే సమయం ఆటగాళ్లకు దొరకడం లేద‌న్న ద్ర‌విడ్‌ 
  • కొంత సమయం పట్టినా జట్టు పుంజుకుంటుందని మాజీ కోచ్‌ ధీమా
భారత క్రికెట్ జట్టులో సూపర్ స్టార్ కల్చర్‌ను అంతం చేయాలనే ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆలోచనా విధానంతో మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ విభేదించాడు. ఏ క్రీడకైనా హీరోలు చాలా అవసరమని, వారి అద్భుత ప్రదర్శనలే భావితరాలకు స్ఫూర్తినిస్తాయని స్పష్టం చేశాడు. 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలిపిన తర్వాత తన పదవీకాలం ముగించుకున్న ద్రవిడ్, ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు.

విస్డెన్ 'స్కూప్' పాడ్‌కాస్ట్‌లో ద్రవిడ్ మాట్లాడుతూ.. "ఏ ఆటకు అయినా హీరోలు అవసరం. మైదానంలో రాణించకుండా ఎవరూ హీరోలు కాలేరు. ముఖ్యంగా భారతదేశంలో ప్రశంసలతో పాటు విమర్శలు, ఒత్తిడి కూడా తీవ్రంగా ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకుని నిలబడి, జట్టుకు విజయాలు అందిస్తేనే ఒక ఆటగాడు లెజెండ్ లేదా సూపర్‌స్టార్‌గా ఎదుగుతాడు. అలా ఎదిగారంటే వారు ఎన్నో సరైన పనులు చేసినట్టే" అని వివరించాడు. గంభీర్ విధానానికి భిన్నంగా ద్రవిడ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

ఇదే సమయంలో గంభీర్ కోచింగ్‌లో టెస్టు క్రికెట్‌లో భారత జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంపై కూడా ద్రవిడ్ స్పందించాడు. "ఇటీవల కొన్ని టెస్టు సిరీస్‌లలో మనం సరిగ్గా ఆడలేకపోయాం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజాలు రిటైర్ అవ్వడంతో వారి లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అలాంటి ఆటగాళ్ల స్థానాన్ని భర్తీ చేయడం అంత సులభం కాదు. అయినా భారత క్రికెట్ ఇప్పటికీ చాలా బలంగా ఉంది. కొంత సమయం పట్టొచ్చు, కానీ జట్టు అన్ని ఫార్మాట్లలోనూ పోటీ ఇస్తుందని నేను నమ్ముతున్నాను" అని ద్రవిడ్ ధీమా వ్యక్తం చేశాడు.

ప్రస్తుత తరానికి రెడ్-బాల్ క్రికెట్ ఆడాలనే తపన ఉన్నప్పటికీ, అధికంగా జరుగుతున్న పరిమిత ఓవర్ల క్రికెట్ కారణంగా వారు టెస్టులకు పూర్తిగా సిద్ధం కాలేకపోతున్నారని ద్రవిడ్ పేర్కొన్నాడు. "బహుళ ఫార్మాట్లలో ఆడుతున్న నేటి ఆటగాళ్లకు, టెస్టు సిరీస్‌లకు సిద్ధమయ్యేందుకు మా తరానికి దొరికినంత సమయం దొరకడం లేదు. ఇది వారి తప్పు కాదు, ప్రస్తుత క్రికెట్ షెడ్యూల్ అలాంటిది" అని ద్ర‌విడ్ చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Rahul Dravid
Gautam Gambhir
Indian Cricket
Team India
Superstar culture
T20 World Cup
Test Cricket
Virat Kohli
Rohit Sharma
Ravichandran Ashwin

More Telugu News