ట్రంప్ చైనా పర్యటనలో అనూహ్య పరిణామాలు.. అనధికారికంగా కఠిన ఆంక్షలు

  • జర్నలిస్టులు, సెక్యూరిటీ సిబ్బందికి ఇక్కట్లు
  • బాత్రూమ్‌కు అనుమతించే విషయంలోనూ ఆంక్షలు
  • భద్రత విషయంలోనూ అమెరికా అలర్ట్
చైనాలో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యక్రమాల్లో తెరవెనక అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం. డ్రాగన్ దేశం అనధికారికంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జర్నలిస్టులు, సెక్యూరిటీ సిబ్బంది సహా ఇతర అధికారులను అనుమతించే విషయంలో చైనా కఠిన నియంత్రణలు పాటిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ట్రంప్ ద్వైపాక్షిక భేటీ సమయంలో ఆ దేశ మీడియా దురుసుగా ప్రవర్తించినట్లు న్యూయార్క్ పోస్ట్ రాసుకొచ్చింది. వేదిక దగ్గరకు వెళ్తుండగా చైనా రిపోర్టర్లు వైట్ హౌస్ జర్నలిస్టుల్లో ఒకర్ని గట్టిగా తోసుకుంటూ వెళ్లినట్లు ఆరోపించింది. పెద్దగా గాయాలేమీ కానప్పటికీ.. వారి ప్రవర్తనాశైలి పట్ల అమెరికన్ అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

బీజింగ్‌లోని ‘టెంపుల్ ఆఫ్ హెవెన్’ దగ్గర కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆయుధం ఉందన్న పేరిట అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌ను లోపలికి అనుమతించలేదు. యూఎస్ అధ్యక్షుడి రక్షణ బృందం ఆయుధాన్ని నిరంతరం వెంటబెట్టుకొని ఉండడం తప్పనిసరి. దీంతో ఇరు దేశాల అధికారుల మధ్య దాదాపు 30 నిమిషాల పాటు వాగ్వాదం జరిగింది. చివరకు అప్పటికే లోపలికి వెళ్లిన మరో ఏజెంట్ వచ్చి రిపోర్టర్లను వేదిక వద్దకు తీసుకెళ్లారు. 

అధ్యక్షుడి కాన్వాయ్‌లోకి రిపోర్టర్లను అనుమతించే విషయంలోనూ ఇదే తరహా ఘర్షణ చోటు చేసుకుంది. ఇలా పర్యటన మొదలైనప్పటి నుంచి అమెరికన్ ప్రతినిధి బ‌ృందం, ముఖ్యంగా జర్నలిస్టులు ఏదో ఒక రూపంలో కఠిన ఆంక్షలు ఎదుర్కొన్నారు. చివరకు బాత్‌రూమ్‌కు అనుమతించే విషయంలోనూ చైనా అధికారులు అతిగా ప్రవర్తించారనే ఆరోపణలు వస్తున్నాయి.

మరోవైపు సెక్యూరిటీ విషయంలోనూ అమెరికా అధికారులు ఆందోళనలు వ్యక్తం చేశారు. పర్యటనకు వచ్చిన సిబ్బంది, రిపోర్టర్లను బర్నర్ ఫోన్లు వాడాలని అమెరికా పాలకవర్గం సూచించింది. అలాగే తాత్కాలిక ఈమెయిల్స్ వాడాలని ఆదేశించింది. లేదంటే సైబర్ అటాక్, హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

Donald Trump
Trump China visit
China US relations
Xi Jinping
US China trade
Temple of Heaven
White House journalists
cyber attack
Beijing
US Secret Service

More Telugu News