తెలంగాణలో కొత్త పార్కింగ్ పాలసీ.. అడ్డగోలుగా పార్క్ చేస్తే వాహనం వేలానికే!

  • తెలంగాణలో కొత్త పార్కింగ్ పాలసీకి ప్రభుత్వ సన్నాహాలు
  • అక్రమ పార్కింగ్ వాహనాలను స్వాధీనం చేసుకోనున్న అధికారులు
  • టోయింగ్, పార్కింగ్ ఛార్జీలతో పాటు పాత చలాన్ల చెల్లింపు తప్పనిసరి
  • నిర్ణీత గడువులోగా తీసుకోకపోతే వాహనాల వేలం
  • సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రవాణా శాఖ ముసాయిదా రూపకల్పన
తెలంగాణలో వాహనాల పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. రోడ్లపై అడ్డగోలుగా వాహనాలు నిలపడం, రోజుల తరబడి వదిలేయడం వంటి చర్యలతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ కొత్త పార్కింగ్ పాలసీ ముసాయిదాను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపుదిద్దుకున్న ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే, వాహనదారుల జేబుకు చిల్లు పడటమే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాహనాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.

ఈ ముసాయిదాలోని నిబంధనల ప్రకారం ఇకపై ఎక్కడపడితే అక్కడ వాహనాన్ని పార్క్ చేస్తే కేవలం జరిమానాతో వదిలిపెట్టరు. ట్రాఫిక్‌కు ఇబ్బందిగా, ఫుట్‌పాత్‌లపై, నో పార్కింగ్ జోన్లలో ఉన్న వాహనాలను అధికారులు వెంటనే టోయింగ్ చేసి స్వాధీనం చేసుకుంటారు. వాహన యజమాని తన బండిని తిరిగి పొందాలంటే టోయింగ్ ఛార్జీలు, వాహనాన్ని యార్డులో ఉంచినన్ని రోజులకు రోజువారీ పార్కింగ్ ఫీజు చెల్లించాలి. అంతేగాక‌ ఆ వాహనంపై ఉన్న పెండింగ్ చలాన్లు, ఇతర జరిమానాలు మొత్తం చెల్లించిన తర్వాతే వాహనాన్ని అప్పగిస్తారు.

గడువులోగా తీసుకోకపోతే వాహనాల వేలం
ఈ కొత్త విధానంలో అత్యంత కీలకమైన అంశం వాహనాల వేలం. అధికారులు స్వాధీనం చేసుకున్న వాహనాన్ని నెల నుంచి 45 రోజుల్లోగా యజమాని క్లెయిమ్ చేసుకోకపోతే, ఆ వాహనాన్ని ప్రభుత్వపరం చేసి బహిరంగ వేలం వేసే అధికారం అధికారులకు ఉంటుంది. ఇలా స్వాధీనం చేసుకున్న వాహనాలను భద్రపరిచేందుకు పీపీపీ పద్ధతిలో ప్రత్యేక పార్కింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని కూడా రవాణా శాఖ ప్రతిపాదించింది.

ప్రాంతాలను బట్టి ఈ ఛార్జీలు మార్పు
నిర్బంధించిన వాహనాలకు విధించే రోజువారీ పార్కింగ్ ఫీజులను కూడా ముసాయిదాలో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రాంతాలను బట్టి ఈ ఛార్జీలు మారతాయి. ద్విచక్ర వాహనానికి రోజుకు రూ.20 నుంచి రూ.30, ఆటోకు రూ.35 నుంచి రూ.50, కారుకు రూ.60 నుంచి రూ.80, బస్సు లేదా లారీకి రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ముసాయిదా దశలో ఉన్న ఈ పాలసీని ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలు స్వీకరించి తుది మార్పులతో అమలు చేయనుంది.

Telangana Parking Policy
Telangana
Parking Rules
Traffic Management
Vehicle Towing
Vehicle Auction
Road Safety
Hyderabad Traffic
New Parking Policy
Supreme Court

More Telugu News