టీసీఎస్‌లో తీవ్ర లైంగిక వేధింపులు.. జాతీయ మహిళా కమిషన్ నివేదికలో సంచలన విషయాలు

Tata Consultancy Services Sexual Harassment Allegations NCW Report
  • 'పోష్' చట్టం అమలులో పూర్తి వైఫల్యం కనిపించిందన్న ఎన్‌సీడబ్ల్యూ
  • ఉద్యోగినులపై మతపరమైన వ్యాఖ్యలు నిజమేనని వ్యాఖ్య
  • విషపూరిత పని వాతావరణం ఉందని నివేదికలో వెల్లడి
  • మహారాష్ట్ర ప్రభుత్వానికి 50 పేజీల నివేదిక సమర్పణ
ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు చెందిన నాసిక్ కార్యాలయంలో తీవ్ర స్థాయిలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, పని ప్రదేశంలో మహిళల భద్రతకు ఉద్దేశించిన 'పోష్' చట్టాన్ని ఏమాత్రం అమలు చేయడం లేదని జాతీయ మహిళా కమిషన్ (NCW) సంచలన నివేదికను వెలువరించింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి మే 8న 50 పేజీల నివేదికను సమర్పించింది.

నాసిక్‌లోని టీసీఎస్ కాల్ సెంటర్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సుమోటోగా విచారణ చేపట్టిన ఎన్‌సీడబ్ల్యూ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 18, 19 తేదీల్లో ఈ కమిటీ కార్యాలయాన్ని సందర్శించి ఉద్యోగులతో మాట్లాడి నివేదికను రూపొందించింది. కార్యాలయంలో ‘విషపూరిత పని వాతావరణం’, ‘వ్యవస్థీకృత బెదిరింపులు’ ఉన్నాయని కమిటీ తన నివేదికలో పేర్కొంది. కొందరు నిందితులు మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని, వారి మత విశ్వాసాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, ఇస్లాం గొప్పదంటూ ఒత్తిడి తెచ్చారని ఆరోపించింది.

"సంక్షిప్తంగా చెప్పాలంటే, పోష్ (ప్రివెంటివ్, ప్రొబిషన్ అండ్ రిడ్రెసల్) చట్టం అమలు సున్నా స్థాయిలో ఉంది" అని కమిటీ స్పష్టం చేసింది. ముఖ్యంగా యువ, జెన్-జీ ఉద్యోగులు ఈ వేధింపులకు ఎక్కువగా గురైనట్లు గుర్తించింది. ఈ కేసులో భాగంగా ఇప్పటికే 9 ఎఫ్ఐఆర్‌లు నమోదు కాగా, 9 మందిని అరెస్టు చేశారు.

అయితే, ఈ ఆరోపణలను టీసీఎస్ వర్గాలు ఖండించినట్లు తెలుస్తోంది. పోష్ చట్టాన్ని తాము పూర్తిగా పాటిస్తున్నామని, ఈ విషయంపై ఎన్‌సీడబ్ల్యూను సంప్రదించి తమ వాదన వినిపిస్తామని కంపెనీ వర్గాలు తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ నివేదిక మహారాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద ఉంది.
Go Back to Shorts
Tata Consultancy Services
TCS
National Commission for Women
NCW
sexual harassment
POSH Act
Maharashtra
Nashik
workplace safety
women employees

More Telugu News