విజయ్ ప్రభుత్వంలో కీలక ఘట్టం.. అసెంబ్లీ స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవ ఎన్నిక

JCD Prabhakar Elected Tamil Nadu Assembly Speaker Under Vijay
  • తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవం
  • డిప్యూటీ స్పీకర్‌గా రవిశంకర్‌ను ఎన్నుకున్న సభ
  • స్పీకర్‌ను కుర్చీ వద్దకు తోడ్కొని వెళ్లిన సీఎం, ప్రతిపక్ష నేత
  • విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన ఏఎంఎంకే ఎమ్మెల్యే
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలో కొలువుదీరిన నూతన ప్రభుత్వం.. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవంగా పూర్తి చేసింది. 17వ తమిళనాడు శాసనసభ స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్, డిప్యూటీ స్పీకర్‌గా రవిశంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అసెంబ్లీ సమావేశాల రెండో రోజు ఈ ఎన్నిక జరిగింది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు వేరే అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రొటెం స్పీకర్ కరుప్పియా ప్రకటించారు. అనంతరం, సభా సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రి విజయ్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్.. నూతన స్పీకర్ ప్రభాకర్‌ను గౌరవంగా స్పీకర్ కుర్చీ వద్దకు తోడ్కొని వెళ్లారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గాను, నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. పలు పార్టీల మద్దతుతో టీవీకే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నిన్న‌ ప్రారంభమైన తొలి సెషన్‌లో ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేయగా, రెండో రోజు స్పీకర్ ఎన్నికను పూర్తి చేశారు.

నూతనంగా ఎన్నికైన స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌కు ముఖ్యమంత్రి విజయ్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌తో పాటు పలువురు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ మాట్లాడుతూ, టీవీకే ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని, ముఖ్యమంత్రి విజయ్ రాబోయే ఐదేళ్లు సుపరిపాలన అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉత్కంఠభరితమైన ఎన్నికల తర్వాత శాసనసభ కార్యకలాపాలు సజావుగా సాగడానికి ఈ ఏకగ్రీవ ఎన్నిక దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Go Back to Shorts
Vijay
Tamil Nadu Assembly
JCD Prabhakar
Tamilaga Vetri Kazhagam
TVK Party
MK Stalin
Tamil Nadu Politics
Assembly Speaker Election
Ravi Shankar

More Telugu News