సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని నెహ్రూ వ్యతిరేకించారు: ప్రధాని మోదీ

PM Modi Accuses Nehru of Obstructing Somnath Temple Rebuilding
  • సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్‌ల కృషి వల్లే ఆలయం పూర్తయిందని వెల్లడి
  • బుజ్జగింపు రాజకీయాలు చేసే శక్తులు దేశంలో ఇప్పటికీ ఉన్నాయని విమర్శ
  • రామాలయ నిర్మాణాన్ని కూడా కొందరు వ్యతిరేకించారని గుర్తు చేసిన మోదీ
  • అభివృద్ధి, వారసత్వం రెండూ తమ ప్రభుత్వ అజెండా అని స్పష్టీకరణ
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై తీవ్ర విమర్శలు చేశారు. స్వాతంత్య్రానంతరం గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని నెహ్రూ వ్యతిరేకించారని ఆరోపించారు. బుజ్జగింపు రాజకీయాల కోసం జాతీయ ఆత్మగౌరవాన్ని పక్కనపెట్టే శక్తులు దేశంలో ఇప్పటికీ ఉన్నాయని, అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం నిర్వహించిన 'సోమనాథ్ అమృత్ మహోత్సవ్‌'లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "1951లో సోమనాథ్ ఆలయ పునఃప్రతిష్ఠ కేవలం ఒక సాధారణ విష‌యం కాదు. అది భారతదేశ స్వతంత్ర నాగరిక స్పృహకు ప్రతీక" అని అన్నారు. స్వాతంత్య్రానంతరం ఆలయ పునర్నిర్మాణానికి అంకితభావంతో పనిచేసిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌ల సేవలను ప్రధాని కొనియాడారు. "500కు పైగా సంస్థానాలను ఏకం చేసి ఆధునిక భారతాన్ని నిర్మించిన సర్దార్ పటేల్, సోమనాథ్ పునర్నిర్మాణం ద్వారా మన ప్రాచీన వైభవాన్ని తిరిగి పొందుతున్నామన్న సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చారు" అని మోదీ వివరించారు.

అయితే, ఈ మహత్కార్యానికి నెహ్రూ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైందని మోదీ ఆరోపించారు. "ఆలయ పునర్నిర్మాణం కోసం సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ ఎంతో కృషి చేశారు. కానీ, వారికి నెహ్రూ జీ నుంచి ఎంత వ్యతిరేకత వచ్చిందో మనందరికీ తెలుసు. ఈ రోజు నేను ఆ వివరాల్లోకి వెళ్లడం లేదు. కానీ, సర్దార్ పటేల్ సంకల్పం ముందు ఏదీ నిలవలేదు. శతాబ్దాల అవమానాన్ని చెరిపేస్తూ సోమనాథ్ ఆలయం పునర్నిర్మితమైంది" అని మోదీ పేర్కొన్నారు.

ఈ చారిత్రక నేపథ్యాన్ని ప్రస్తుత రాజకీయాలతో ముడిపెడుతూ.. "జాతీయ ఆత్మగౌరవం కంటే బుజ్జగింపు రాజకీయాలకే ప్రాధాన్యమిచ్చే శక్తులు ఇప్పటికీ ఉన్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం సమయంలోనూ ఇదే తరహా వ్యతిరేకత చూశాం. మనం ఇలాంటి సంకుచిత రాజకీయాలను దాటి ముందుకు సాగాలి. అభివృద్ధి, వారసత్వం రెండింటినీ కలిపి ముందుకు తీసుకెళ్లాలి" అని అన్నారు. గత పదేళ్లలో కాశీ విశ్వనాథ్ ధామ్, ఉజ్జయిని మహాకాల్ మహలోక్, కేదార్‌నాథ్ పునర్నిర్మాణం వంటి ప్రాజెక్టుల ద్వారా దేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ తెలిపారు. ఈ వేడుకలు కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడం కోసం కాదని, రాబోయే వెయ్యేళ్లకు దేశానికి స్ఫూర్తినిచ్చే పండుగ అని ఆయన అభివర్ణించారు. అంతకుముందు ప్రధాని ఆలయంలో జరిగిన కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు.
Go Back to Shorts
PM Modi
Narendra Modi
Somnath Temple
Jawaharlal Nehru
Gujarat
Temple Reconstruction
Sardar Vallabhbhai Patel
Ayodhya Ram Mandir
Cultural Revival
Hindu Temple
Somnath Amrit Mahotsav

More Telugu News