బంగారం కొనొద్దన్న మోదీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఘాటు స్పందన

  • ప్రజలు త్యాగాలు చేయాలన్న ప్రధాని మోదీ విజ్ఞప్తి
  • ఇది వైఫల్యానికి నిదర్శనమంటూ రాహుల్ గాంధీ విమర్శ
  • ఏడాది పాటు బంగారం కొనొద్దని, ఇంటి నుంచే పనిచేయాలని సూచించిన మోదీ
  • ప్రతిసారీ బాధ్యతను ప్రజలపై నెట్టేస్తున్నారన్న రాహుల్
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రజలు త్యాగాలు చేయాలంటూ ప్రధాని చేసిన విజ్ఞప్తి 'వైఫల్యానికి నిదర్శనం' అని ఆయన అభివర్ణించారు.

సోమవారం నాడు ఎక్స్ వేదికగా రాహుల్ స్పందిస్తూ.. "నిన్న మోదీజీ ప్రజలను త్యాగాలు చేయమని అడిగారు. బంగారం కొనొద్దు, విదేశాలకు వెళ్లొద్దు, పెట్రోల్ వాడకం తగ్గించండి అన్నారు. ఇవి ఉపన్యాసాలు కాదు.. వైఫల్యానికి రుజువులు" అని పేర్కొన్నారు. "12 ఏళ్లలో ఆయన దేశాన్ని ఇంతటి స్థితికి తీసుకొచ్చారు. ప్రతిసారీ బాధ్యతను ప్రజలపైకి నెట్టివేసి, తాము తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక 'కాంప్రమైజ్డ్ ప్రధాని' దేశాన్ని నడిపించడం ఇక సాధ్యం కాదు" అని రాహుల్ తీవ్రంగా విమర్శించారు.

ప్రధాని విజ్ఞప్తి ఇదే.. 
హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, పశ్చిమాసియా సంక్షోభం వల్ల దేశ విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడి పడుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఏడాది పాటు బంగారం కొనడం ఆపాలని, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి, మెట్రో, కార్ పూలింగ్ వంటివి ఉపయోగించాలని సూచించారు. అలాగే, వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచే పని) విధానాన్ని మళ్లీ పాటించాలని, వంట నూనెలు, ఎరువుల వాడకం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఏ విధంగానైనా విదేశీ మారకాన్ని ఆదా చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

Rahul Gandhi
Narendra Modi
Modi
Congress
BJP
West Asia crisis
Indian economy
Foreign exchange reserves
Gold purchase
Petroleum usage

More Telugu News