జగపతిబాబు కామెంట్స్ తో 'పెద్ది' హైప్ మరో లెవల్ కి!

  • రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాపై జగపతిబాబు ప్రశంసలు
  • తన పాత్రను చూసి ఆశ్చర్యపోయానని వ్యాఖ్య
  • బుచ్చిబాబు సానా దర్శకత్వంలో భారీ అంచనాలు
  • జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
  • ఫైనల్ ఎడిట్ పూర్తి చేసుకున్న ‘పెద్ది’
 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, సీనియర్ నటుడు జగపతి బాబు చేసిన తాజా వ్యాఖ్యలు ఆ అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రంలో తన పాత్ర గురించి ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమా గురించి జగపతి బాబు మాట్లాడుతూ.. "మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబు నా పాత్రను డిజైన్ చేసిన విధానం చూసి నేనే ఆశ్చర్యపోయాను.. నేను ఏ మాత్రం ఊహించిన విధంగా నా పాత్ర ఉంది... సినిమా సంగతి సరేసరి... మామూలుగా ఉండదు" అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో జగపతి బాబు 'అప్పలసూరి' అనే కీలక పాత్ర పోషిస్తున్నారు. తన పాత్ర, లుక్ పట్ల ఆయన పూర్తి సంతృప్తి, అదే సమయంలో ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో సినిమాపై ఆసక్తి రెట్టింపు అయింది.

గ్రామీణ క్రీడా నేపథ్యంతో కూడిన యాక్షన్ డ్రామాగా ‘పెద్ది’ రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ‘పెద్ది పెహెల్వాన్’గా నటిస్తుండగా, జాన్వీ కపూర్ ‘అచ్చియమ్మ’ పాత్రలో కనిపించనుంది. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి.

ఇటీవలే చిత్రబృందం సినిమా ఫైనల్ ఎడిట్‌ను లాక్ చేసినట్టు అధికారికంగా ప్రకటించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 3 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్లు ప్రారంభించి, జూన్ 4న సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జగపతి బాబు తాజా వ్యాఖ్యలతో ‘పెద్ది’ కోసం అభిమానుల ఎదురుచూపులు తారాస్థాయికి చేరాయి.

స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాను మరో లెవల్ కి చేర్చింది. 

Jagapathi Babu
Ram Charan
Peddi
Buchi Babu Sana
Janhvi Kapoor
Shiva Rajkumar
Telugu Movie
Action Drama
Rural Sports
AR Rahman

More Telugu News