నాడు పీకలు కోసి.. నేడు నీతులు మాట్లాడటమా?: వైసీపీ నేతలపై కొల్లు రవీంద్ర ఫైర్

Kollu Ravindra Fires at YSRCP Leaders
  • వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు
  • నాడు అరాచకాలు చేసి నేడు నీతులు చెబుతున్నారని ఎద్దేవా
  • విద్యా, వైద్య రంగాలను జగన్ సర్కార్ నాశనం చేసిందని ఆరోపణ
  • ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టింది వైసీపీయేనని ఫైర్
  • పీపీపీ విధానంతోనే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం
వైసీపీ నేతలు నాడు ప్రజల పీకలు కోసి, అరాచకాలకు పాల్పడి.. నేడు నీతులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారి ఉత్తర కుమార ప్రగల్భాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రస్తుత కూటమి ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు.

వైద్య రంగంలో వాస్తవాలు ఇవి
ఓ స్వయం ప్రకటిత మేధావి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తామే కట్టామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 22 మెడికల్ కాలేజీలు నిర్మించారని గుర్తు చేశారు. ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌ను ఏపీకి తీసుకొచ్చింది చంద్రబాబే అయితే, దానికి ఐదేళ్ల పాటు కనీసం తాగునీరు కూడా ఇవ్వని నీచ చరిత్ర జగన్ రెడ్డిదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎయిమ్స్‌కు కృష్ణా జలాలను అందించిన ఘనత తమదేనని స్పష్టం చేశారు. 

"ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం తప్ప జగన్ చేసిందేమిటి? రూ.8,480 కోట్ల అంచనాతో 17 కాలేజీల నిర్మాణానికి కేంద్రం నిధులు మినహా రాష్ట్రం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు" అని ఆరోపించారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో పనులు ఆలస్యమవుతాయనే ఉద్దేశంతోనే ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానాన్ని ఎంచుకున్నామన్నారు. ఈ విధానం ద్వారా రెండేళ్లలో 2500 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తేవడమే లక్ష్యమన్నారు. పీపీపీ ఆసుపత్రుల్లో 70 శాతం పడకలు ఎన్టీఆర్ వైద్య సేవ, ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులకు కేటాయించి పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు.

విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారు
జగన్ రెడ్డి హయాంలో విద్యా రంగం పూర్తిగా నాశనమైందని కొల్లు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. 2014-19 మధ్య విద్యా ప్రమాణాల్లో మూడో స్థానంలో ఉన్న ఏపీ, 2019-24 నాటికి 19వ స్థానానికి పడిపోయిందని విమర్శించారు. "ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ నిర్వహించలేదు. వేలాది స్కూళ్లను మూసివేసి గ్రామీణ విద్యార్థులను చదువుకు దూరం చేశారు. పదో తరగతి ఉత్తీర్ణత 62 శాతానికి పడిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని 85 శాతానికి పెంచిన ఘనత నారా లోకేశ్‌ది. అధికారంలోకి రాగానే 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం" అని తెలిపారు. 

జగన్ పాలనలో విద్యార్థులు కనీసం అంకెలు, అక్షరాలు కూడా గుర్తించలేని స్థితికి దిగజారారని ‘అసర్’ సంస్థ నివేదికను ఉటంకించారు. నాడు-నేడు పేరుతో రంగులేసుకుని వేల కోట్లు దిగమింగారని, ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు.

ఆస్తులు తాకట్టు పెట్టింది మీరు కాదా?
పీపీపీ పేరుతో ఆస్తులు దోచిపెడుతున్నారంటూ వైసీపీ చేస్తున్న విమర్శలను రవీంద్ర తిప్పికొట్టారు. రాష్ట్ర ఆస్తులను, చివరికి తాగుబోతులను కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన ఘనత జగన్‌దేనని ఆరోపించారు. గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను ప్రైవేటుకు కట్టబెట్టారని, అమరావతి భూములను తాకట్టు పెట్టారని గుర్తు చేశారు. ఒక్క విశాఖలోనే కలెక్టరేట్‌తో సహా 13 కీలక ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి రూ.1600 కోట్లు అప్పు చేశారని, దీనిని ప్రజాధనం దుర్వినియోగం అంటారని అన్నారు.

వ్యవస్థల విధ్వంసం, అరాచక పాలన
జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో వ్యవస్థల విధ్వంసం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదని మంత్రి అన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి, అమరావతిని చంపి, పోలవరాన్ని నాశనం చేశారని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలపై దాడులు, ప్రశ్నించిన వారిపై హత్యలతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారని ఆరోపించారు. మద్యంపై వేల కోట్లు దండుకుని, ఆ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టారని అన్నారు. 

చివరికి ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును అమ్మేయడానికి కూడా ప్రయత్నించిన నీచుడు జగన్ అని, ఈ దుర్మార్గాలను నాటి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యమే బట్టబయలు చేశారని పేర్కొన్నారు. "చిన్నప్పుడు చదువుకున్న శాకాహారిగా మారిన మొసలి కథలా వైసీపీ నేతల కబుర్లు ఉన్నాయి. అడుగడుగునా అరాచకాలకు పాల్పడి ఇప్పుడు నీతులు చెప్పడం సిగ్గుచేటు" అని కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు.


Go Back to Shorts
Kollu Ravindra
YSRCP
Andhra Pradesh
Chandrababu Naidu
Medical Colleges
Education System
Public Private Partnership
Loan Debts
Visakha Steel Plant
Nara Lokesh

More Telugu News