విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ

Vijay Swearing in Ceremony Attended by Rahul Gandhi
  • తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం నేడే
  • కాంగ్రెస్, ఇతర పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు
  • మొత్తం 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కొలువుదీరనున్న సర్కార్
తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలుకానుంది. నటుడి నుంచి రాజకీయ నేతగా మారిన సి. జోసెఫ్ విజయ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నేడు (మే 10) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ హాజరుకానుండటంతో దీనికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఏర్పడింది.

రాహుల్ గాంధీ ఉదయం 8:40 గంటలకు విమానంలో చెన్నై చేరుకుంటారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆయన పర్యటన, ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో నగరంలోని కీలక ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, విజయ్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు జాతీయ, ప్రాంతీయ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది.

ఇటీవల జరిగిన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, 234 స్థానాలున్న అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజారిటీ (118) మాత్రం సాధించలేకపోయింది. దీంతో ఎన్నికల ఫలితాల వెంటనే కాంగ్రెస్ పార్టీ విజయ్‌కు మద్దతు ప్రకటించింది. కమ్యూనిస్టు పార్టీలు, విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) కూడా బేషరతుగా మద్దతు తెలిపాయి.

మిత్రపక్షాల మద్దతుతో టీవీకే కూటమి బలం 120కి చేరడంతో, ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ అర్లేకర్, విజయ్‌ను అధికారికంగా ఆహ్వానించారు. విజయ్‌తో పాటు కొద్దిమంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని, పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని తర్వాత విస్తరించవచ్చని తెలుస్తోంది. 
Go Back to Shorts
Vijay
Tamil Nadu
Rahul Gandhi
Tamilaga Vettri Kazhagam
TVK
Tamil Nadu Assembly Elections 2026
Chief Minister
Rajendra Vishwanath Arlekar
Congress
Chennai

More Telugu News