ప్రేమకు లొంగిపోయిన 'రౌడీ జనార్ధన'.. విజయ్ పుట్టినరోజున ఇంట్రెస్టింగ్ పోస్టర్

Vijay Devarakonda Rowdy Janardhana Poster Released on Birthday
  • విజయ్ దేవరకొండ బ‌ర్త్‌డే సందర్భంగా 'రౌడీ జనార్ధన' చిత్రం నుంచి కొత్త పోస్టర్ రిలీజ్‌
  • వర్షంలో తడుస్తూ, చేతిలో రివాల్వర్‌తో ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన విజయ్ 
  • రవికిరణ్ కోలా దర్శకత్వం.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణం
  • ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న కీర్తి సురేశ్‌
  • డిసెంబర్ లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల
విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం 'రౌడీ జనార్ధన' నుంచి చిత్రబృందం ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఈ స్టిల్ మరింత ఆసక్తిని పెంచింది.

విడుదల చేసిన ఈ కొత్త పోస్టర్‌లో విజయ్ దేవరకొండ వర్షంలో తడుస్తూ, చేతిలో రివాల్వర్ పట్టుకుని ఉన్నారు. ఓ యువతి పాదాలను ఆయన తన ఛాతీపై ఉంచుకుని, రొమాంటిక్‌గా చూస్తూ కనిపించారు. చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. "ప్రపంచంతో పోరాడే మనిషి... కానీ ప్రేమకు మాత్రమే లొంగిపోతాడు. మా రౌడీ జనార్ధన విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు" అని క్యాప్షన్ జోడించింది.

'రాజా వారు రాణి గారు' చిత్రంతో గుర్తింపు పొందిన రవికిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేశ్‌ కథానాయికగా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో విజయ్ దేవరకొండ సరికొత్త గెటప్, డైలాగ్ డెలివరీతో మాస్ అవతారంలో కనిపించి అంచనాలు పెంచేశారు.

1980ల కాలంలో తూర్పు గోదావరి జిల్లా నేపథ్యంలో సాగే ఈ కథను తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Go Back to Shorts
Vijay Devarakonda
Rowdy Janardhana
Vijay Devarakonda birthday
Dil Raju
Keerthy Suresh
Ravi Kiran Kola
Sri Venkateswara Creations
Telugu cinema
East Godavari
Love story

More Telugu News