యువ క్రికెటర్ కు వార్నింగ్ ఇచ్చిన బీసీసీఐ... కారణం ఇదే!

Arshdeep Singh Warned by BCCI Over Social Media Vlog
  • యూట్యూబ్ వ్లాగ్స్ ఆపేయాలని అర్షదీప్ సింగ్‌కు బీసీసీఐ ఆదేశం
  • వ్లాగ్‌లో చాహల్ వేపింగ్ చేస్తూ కనిపించడమే వివాదానికి కారణం
  • భారత్‌లో వేపింగ్ చట్టవిరుద్ధమని బీసీసీఐ స్పష్టీకరణ
  • ఇప్పటికే అన్ని జట్లకు కఠిన నిబంధనలు జారీ చేసిన బోర్డు 
టీమిండియా, పంజాబ్ కింగ్స్ యువ పేసర్ అర్షదీప్ సింగ్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసే వరకు సోషల్ మీడియాలో ఎలాంటి వ్లాగ్స్ (వీడియో బ్లాగ్స్) చేయవద్దని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సహచర ఆటగాడు యజువేంద్ర చాహల్‌కు సంబంధించిన ఒక వీడియో వివాదాస్పదం కావడమే ఇందుకు కారణంగా వార్తలు వస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ కింగ్స్ జట్టు అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో ప్రయాణిస్తుండగా అర్షదీప్ సింగ్ ఒక ట్రావెల్ వ్లాగ్‌ను చిత్రీకరించి తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో, సహచర ఆటగాడు యజువేంద్ర చాహల్ వేప్ లేదా ఇ-సిగరెట్ ఉపయోగిస్తున్నట్లు కనిపించడం వివాదానికి దారి తీసింది. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారత్‌లో వేపింగ్ చట్టవిరుద్ధం కావడం, ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే కావడంతో బీసీసీఐ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం.

ఇటీవలే బీసీసీఐ అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆటగాళ్ల ప్రవర్తన, భద్రతా ప్రమాణాలపై సుమారు 8 పేజీల కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో వేపింగ్, ఎలక్ట్రానిక్ సిగరెట్ల వాడకాన్ని తీవ్రంగా నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది. "వేప్‌లు, ఇ-సిగరెట్ల వాడకం భారత చట్టాల ప్రకారం నిషేధించబడింది. వీటిని ఉపయోగించడం బీసీసీఐ, ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, చట్టపరమైన నేరం కూడా కావచ్చు" అని బీసీసీఐ తన మార్గదర్శకాలలో పేర్కొంది.

ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ చేసినందుకు అతని మ్యాచ్ ఫీజులో 25శాతం కోత విధించిన సంగతి తెలిసిందే. అయితే, అర్షదీప్ వ్లాగింగ్ వ్యవహారంపై బీసీసీఐ, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ గానీ, ఆటగాళ్లు అర్షదీప్, చాహల్ గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
Go Back to Shorts
Arshdeep Singh
Yuzvendra Chahal
BCCI
Punjab Kings
IPL 2026
vaping
e-cigarette
social media
travel vlog
Indian Cricket

More Telugu News