గుంటనక్క కమీషన్లు మింగేసింది.. బీఆర్ఎస్‌పై కవిత తీవ్ర ఆరోపణలు

Kalvakuntla Kavitha Alleges BRS Swallowed Commissions in Irrigation Project
  • ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ కమీషన్లు దండుకుందన్న కవిత
  • రూ.33 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదని ఆరోపణ
  • రేవంత్ ప్రభుత్వం కూడా బిల్లులు చెల్లించి కమీషన్లు తీసుకుందన్న టీఆర్ఎస్ చీఫ్
  • దసరాలోపు పనులు మొదలుపెట్టకపోతే పాదయాత్ర చేస్తానని హెచ్చరిక
  • అధికారంలోకి వస్తే 10 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని హామీ
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని, కమీషన్ల కోసం ప్రాజెక్టును బలిపెట్టాయని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా జిల్లేడ్-చౌదరిగూడలో శుక్రవారం నిర్వహించిన 'పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ'లో ఆమె మాట్లాడారు. ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని విమర్శించారు.

"ప్రాజెక్టు కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేసినా కనీసం 33 ఎకరాలకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నీరు అందించలేకపోయింది. ఓ గుంటనక్క కమీషన్ల కోసం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రాజెక్టు డిజైన్ మార్చింది. జూరాల నుంచి శ్రీశైలానికి సోర్స్ పాయింట్ మార్చడం క్షమించరాని నేరం" అని కవిత మండిపడ్డారు. ఈ మార్పు వల్లనే ఆంధ్రప్రదేశ్‌తో వివాదాలు తలెత్తుతున్నాయని అన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపైనా కవిత విమర్శలు గుప్పించారు. ‘నల్లమల పులి బిడ్డ’నని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టు పనుల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదని ఎద్దేవా చేశారు. కానీ, ప్రాజెక్టు పేరుతో రూ.6 వేల కోట్ల బిల్లులు చెల్లించి కమీషన్లు తీసుకున్నారని, ఇందులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా వాటా ఉందని సంచలన ఆరోపణలు చేశారు. దసరాలోపు పనులు ప్రారంభించకపోతే పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను ఎండగడతామని హెచ్చరించారు.

తాము అధికారంలోకి వస్తే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కింద 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని కవిత హామీ ఇచ్చారు. నీటి పారుదలపై వాటర్ కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేలా ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు.
Go Back to Shorts
Kalvakuntla Kavitha
Palamuru Rangareddy Project
BRS
Telangana Rakshana Sena
Revanth Reddy
Telangana Politics
Irrigation Project
Corruption Allegations
Andhra Pradesh
National Project Status

More Telugu News